16 July, 2026 | 12:35 PM

నాణ్యతలో రాజీ వద్దు.. పాఠశాల నిర్మాణాలు వేగవంతం చేయాలి

16-07-2026 12:23 PM

* ప్రతి వారం పురోగతి కనిపించాలి: అధికారులకు కలెక్టర్ ఆదేశం

* ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులపై కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సమీక్ష

అచ్చంపేట: విద్యార్థులకు ఆధునిక, నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆదేశించారు. ఉప్పునుంతల మండలం రాయిచేడ్ గ్రామంలో గురువారం నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, ప్రభుత్వం ఆమోదించిన డిజైన్‌, మ్యాప్‌, సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగానే పనులు కొనసాగాలని స్పష్టం చేశారు.

అనుమతులు పొందిన నమూనాలో ఎలాంటి మార్పులు చేయకుండా నిర్దేశిత ప్రమాణాల మేరకు నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న బేస్‌మెంట్ పనులను పరిశీలించిన ఆయన, నిర్మాణ వేగాన్ని మరింత పెంచాలని సూచించారు. అవసరమైన యంత్రాలు, నిర్మాణ సామగ్రి, కార్మికులను సమకూర్చి ఎలాంటి జాప్యం లేకుండా పనులు కొనసాగించాలని, ప్రతి వారం స్పష్టమైన పురోగతి కనిపించేలా లక్ష్యాలు నిర్దేశించుకోవాలని సూచించారు.

నిర్మాణ పనుల్లో నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, భవనాలు దీర్ఘకాలం విద్యార్థులకు ఉపయోగపడేలా ప్రతి దశలో ఇంజినీరింగ్ ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ హెచ్చరించారు. సిమెంట్‌, స్టీల్‌, కాంక్రీట్‌ తదితర నిర్మాణ సామగ్రి నాణ్యతను నిరంతరం పరీక్షిస్తూ, భద్రతా చర్యలను కూడా కచ్చితంగా అమలు చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రతి దశ పూర్తయిన వెంటనే నాణ్యతా తనిఖీలు నిర్వహించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

నిర్మాణంలో ఎదురయ్యే సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. అచ్చంపేట నియోజకవర్గ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడంలో ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల కీలకంగా మారుతుందని కలెక్టర్ తెలిపారు. ఆధునిక తరగతి గదులు, వసతి గృహాలు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్‌లు, క్రీడా మైదానాలు, డైనింగ్ హాల్‌ తదితర సౌకర్యాలతో కూడిన సమగ్ర విద్యా వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించనుందని చెప్పారు.

నిర్మాణ పనులు నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. పనుల పురోగతిపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తామని, అలసత్వం ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభివృద్ధి పనుల్లో వేగం, నాణ్యత రెండూ సమానంగా ఉండాలని, ప్రజాధనం వృథా కాకుండా అధికారులు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈడబ్ల్యూఐడీసీ ఈఈ, అచ్చంపేట ఆర్డీవో యాదగిరి, ఇంజినీరింగ్ అధికారులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.