25 July, 2026 | 8:51 PM

బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తాం

25-07-2026 07:47 PM

ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

మెట్‌పల్లి,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం చింతలపేట గ్రామంలో హత్యకు గురైన బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని, నిందితులకు చట్టప్రకారం జీవిత ఖైదు పడేలా అధికారులు సమర్థవంతంగా వ్యవహరించాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. ఆయన శనివారం చింతలపేట గ్రామంలో హత్యకు గురైన కర్రె సునీత కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ధైర్యంగా ఉండాలని సూచించారు.ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్  మాట్లాడుతూ ఈ హత్య అత్యంత దారుణమైనదని, సభ్య సమాజం మొత్తం ఇటువంటి ఘటనలను ఖండించాలని అన్నారు. పరువు హత్యలు జుగుప్సాకరమైనవని, సమాజంలో ఇటువంటి ఘటనలకు ఏమాత్రం తావు ఉండకూడదని పేర్కొన్నారు.అనంతరం హత్య కేసు దర్యాప్తు పురోగతిపై సంబంధిత పోలీసు, రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

కేసు దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేపట్టి నిందితులు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోకుండా, వారికి జీవిత ఖైదు పడే వరకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఈ కేసును పర్యవేక్షిస్తుందని స్పష్టం చేశారు.గత వారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ , సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బాధిత కుటుంబానికి తక్షణ సహాయంగా నాలుగు లక్షల పన్నెండు వెల ఐదు వందల పరిహారం అందజేశారని తెలిపారు.

చార్జిషీట్ దాఖలు చేసిన అనంతరం ఎస్సీ, ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం ప్రకారం మిగిలిన పరిహారం కూడా విడుదల చేయడంతో పాటు బాధితురాలి పిల్లలకు రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన నిబంధనల మేరకు సహాయం, ఇందిరమ్మ ఇల్లు, ప్రభుత్వం తరఫున అందాల్సిన ఇతర అన్ని సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, ఆర్.డి.ఓ. నరసింహరావు,  డీఎస్పీ రాములు ,ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు, ప్రవీణ్, నీలాదేవి, రాంబాబు, శంకర్, ఎస్సీ వెల్ఫేర్ అధికారి రాజకుమార్, ఈడి ఎస్సీ కార్పొరేషన్ కిషోర్, తాశీల్దార్ నీతా,స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.