25 July, 2026 | 9:39 PM

మేడిగడ్డ బ్యారేజ్‌కు పోటెత్తుతున్న వరద

25-07-2026 08:44 PM

85 గేట్లు ఎత్తి దిగువకు వరద నీటి విడుదల

కాళేశ్వరం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం.

మహాదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామ సమీపంలోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్‌కు గోదావరి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో శనివారం సాయంత్రం నాటికి బ్యారేజ్‌కు 1,22,699 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. అదే మేరకు 1,22,699 క్యూసెక్కుల అవుట్‌ఫ్లోను కొనసాగిస్తూ అధికారులు వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో బ్యారేజ్‌లోని మొత్తం 85 రేడియల్ గేట్లను ఎత్తి నీటి విడుదల చేపట్టారు. బ్యారేజ్‌లో నీటి మట్టాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, జలవనరుల శాఖ ఇంజినీర్లు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

ఇదిలా ఉండగా, కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. కేంద్ర జల సంఘం అధికారులు నమోదు చేసిన గణాంకాల ప్రకారం ప్రస్తుతం గోదావరి నీటిమట్టం సుమారు 7 మీటర్ల ఎత్తుకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని నీటిమట్టంలో మరింత పెరుగుదల ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం జారీ చేసే సూచనలను పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. వరద పరిస్థితులను 24 గంటలూ పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.