2 March, 2026 | 5:17 AM

మల్లూరు దేవాలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తాం

02-03-2026 12:00 AM

టెంపుల్ టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది

రాష్ట్ర మంత్రి పొంగులేటి  శ్రీనివాస రెడ్డి

మంగపేట, మార్చి 1 ( విజయక్రాంతి ) : మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని అద్భుతంగా అభి వృద్ధి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.

ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామిని ఆదివారం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ ( సీతక్క), మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, భద్రాచలం, పినపాక శాసన సభ సభ్యులు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు తదితరులతో కలిసి   దర్శించుకు న్నారు.

ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ అర్చకులు, ఉద్యోగులు పూర్ణకుంభంతో, డోలు వాయిద్యాల నడుమ ఘనంగా స్వాగతం పలికారు. స్వామి వారికి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి విచ్చేసిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి అనసూయ ( సీతక్క), ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు తదితరుల గోత్ర నామాలతో గర్భాలయంలో స్వామి వారికి పూజలు నిర్వహించిన అర్చకులు ఆలయ విశిష్టతను వారికి వివరించి స్వామి వారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందించి ఆశ్వీరవచనం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మల్లూరు గుట్టలో స్వయంభుగా వెలసిన హేమాచల లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి విశిష్ట ప్రాముఖ్యత కలిగి ఉందని దశాబ్దాల కాలం నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామి వారి దర్శనం కోసం రావటం జరుగుతుందని, భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తారనే పూర్తి విశ్వాసం తో భక్తులు వస్తుంటారని అన్నారు.

ములుగు ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రాలు నెలవై ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి , ప్రజా ప్రభుత్వం  ఆలోచనలకు అనుగుణంగా మేడారం జాతరను అద్భుతంగా 200 సంవత్సరాల వరకు చెక్కుచెదరకుండా ఉండే విధంగా అభివృద్ధి చేసుకొని, మహా జాతరను గత నెల చివరిలో విజయవంతం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లోని దేవాలయాలను బాసర నుంచి భద్రాచలం వరకు  టెంపుల్ టూరిజం  ప్రాంతంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని వాటికి సంబంధించిన పనులు కూడా త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందని స్పష్టం చేశారు.

స్థానిక మంత్రి సీతక్క కోరిక మేరకు దేవాలయాన్ని అద్భుతంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసి చూపిస్తుందని, అన్ని మతాల భక్తుల మనోభావాలను, అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుంది వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్, అదనపు కలెక్టర్ ( రెవిన్యూ ) సిహెచ్.మహేందర్ జీ, ములుగు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్  రేగ కళ్యాణి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.