2 June, 2026 | 2:58 AM

64 లక్షల టన్నుల ధాన్యం కొన్నాం

02-06-2026 02:11 AM

వరి సాగులో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ 

పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో కొనుగోలు కేంద్రం పరిశీలన

తుంగతుర్తి, జూన్ 1 (విజయక్రాంతి): వరి సాగులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. యాసంగి పంటలో మొత్తం భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం నుంచి 63% కేంద్రానికి పంపించినట్లు తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని మెప్మా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలుతో కలిసి పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 8,575 కేంద్రాలను ఏర్పాటు చేసి, 64 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతులకు ఇబ్బందులకు గురి చేయకుండా తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేశామని చెప్పారు. చివరి గింజ వరకు ప్రభుత్వం కొంటుందని, రైతులు అధైర్య పడవద్దు అని పేర్కొన్నారు. రైతులు ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బు జమ చేసిన ఘనత ప్రభుత్వానికి ఉందని అన్నారు.

జూన్ 4 వరకు జిల్లాలో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రంలో ప్రతి ధాన్యపు బస్తా, మిల్లులకు ఎగుమతి చేయవలసిన బా ధ్యత అధికారులపై ఉందని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అన్నారు. రానున్న రోజు ల్లో ప్రతి నియోజకవర్గానికి రెండో విడతలో 2,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్టు పేర్కొన్నారు.

మంత్రి వెంట కలెక్టర్ తేజస్ నందనాల్ పవర్, రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్, డీసీసీ అధ్యక్షుడు నరసయ్య, మార్కెట్ కమి టీ చైర్మన్ ఎల్సోజు చామంతి నరేష్, నివేదిత, పీఏసీఎస్ చైర్మన్ పాలెపు చంద్రశేఖర్, సైదులు, అధికారులు ఉన్నారు.