23 August, 2026 | 3:05 AM

ఆదిలాబాద్ ఐటీ టవర్.. మరో ముందడుగు

23-08-2026 01:27 AM
  1. స్థానిక యువతకు ఉద్యోగాలు లభించాలి
  2. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ఆగష్టు 22 (విజయక్రాంతి): తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు ఐటీ రంగాన్ని విస్తరించాలన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పానికి ఆదిలాబాద్ ఐటీ టవర్ మరో ముందడుగు పడిందని, ప్రారంభానికి సిద్ధమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌కు సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్‌లోనూ ఐటీ పరిశ్రమ విస్తరించే అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’లో కేటీఆర్ స్పందించారు.

త్వరలో ప్రారంభం కానున్న ఆదిలాబాద్ ఐటీ టవర్ ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల యువతీ యువకులకు స్థానికంగానే ఉద్యోగాలు లభించాలని ఆకాంక్షించారు. తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలను తీసుకెళ్లాలనే లక్ష్యంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ టవర్ల నిర్మాణాలు చేపట్టామని ఆయన తెలిపారు.

అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి ప్రముఖ ఐటీ కంపెనీలను ఆకర్షించేలా చర్యలు తీసుకున్నామ న్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే వరంగల్, సిద్దిపేట, సూర్యాపేట, నల్లగొండ, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, కరీంనగర్ నగరాల్లో ఐటీ టవర్లు ప్రారంభమయ్యాయని కేటీఆర్ గుర్తుచేశారు. అయితే, ప్రస్తుతం ఈ ఐటీ టవర్ల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతున్నదనే వార్తలు వస్తున్నాయని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఐటీ టవర్లలో అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని, మరిన్ని ఐటీ కంపెనీలను ఆకర్షించే చర్యలు చేపట్టాలని కోరారు.