19 May, 2026 | 8:41 PM

పరిశ్రమల ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

19-05-2026 07:12 PM

మాక్ డ్రిల్‌లో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

చిట్యాల,(విజయక్రాంతి): ప్రమాదాలు సంభవించినప్పుడు మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు ఇతరులను కూడా కాపాడాల్సిన అవసరం ఉందని బి. చంద్రశేఖర్ అన్నారు. సోమవారం నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని వియాస్ సైంటిఫిక్ లిమిటెడ్ (సైమ్ ల్యాబ్స్) సంస్థలో నిర్వహించిన “మాక్ డ్రిల్” కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థల ఆదేశాల మేరకు పరిశ్రమలలో ప్రమాదాలు సంభవించినప్పుడు జిల్లా యంత్రాంగం స్పందన, సంసిద్ధతను పరీక్షించే ఉద్దేశంతో ఈ నమూనా విన్యాసాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాదాల సమయంలో సంబంధిత కంపెనీలు వెంటనే స్పందించాలని, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండి ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రాణాలను రక్షించుకోవాలని అన్నారు. ఇలాంటి మాక్ డ్రిల్లుల ద్వారా ప్రమాదాల సమయంలో ఎలా స్పందించాలి, గాయపడిన వారికి ఎలా తక్షణ సహాయం అందించాలనే విషయాలపై అవగాహన పెరుగుతుందని తెలిపారు.

ప్రమాదాల్లో మరణాలు, నష్టాలను తగ్గించడంలో ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీదేవి, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ సతీష్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, అగ్నిమాపక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నుండి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో పరిశీలించారు.