ఉదయం 11 గంటల నుండి నిలకడగా ప్రవహిస్తున్న గోదావరి వరద
భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడవ ప్రమాద హెచ్చరిక
భద్రాచలం నుండి చతిస్గడ్ ఒరిస్సా రాష్ట్రాలతో పాటు మండలాలకు బంద్ అయిన రవాణా సౌకర్యం
బ్యాక్ వాటర్ తో మునిగిపోయిన రామయ్య అన్నదాన సత్రం
ముంపు ప్రాంతాలలో పర్యటించిన కలెక్టర్ అంకిత్
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం గత నాలుగు గంటల నుండి నిలకడగా ఉన్నది. శనివారం ఉదయం 11 గంటలకు 56. 10 అడుగులు చేరుకొని మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగుతున్నది. గోదావరి నదికి మూడో ప్రమాద హెచ్చరిక శుక్రవారం రాత్రి జారీ చేసిన అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో అప్రమత్తమై సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేశారు. భద్రాచలం వద్ద 56 అడుగులకు చేరుకోగానే భద్రాచలం నుండి దుమ్మగూడెం చర్ల వెంకటాపురం వెళ్లే రహదారిపై వరద నీరు ప్రవేశించి ముంచేతడంతో దుమ్ముగూడెం చర్ల వెంకటాపురం వాజేడు ప్రాంతాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది.
భద్రాచలం సరిహద్దును గల ఆంధ్రలోని రాయినిపేట వద్ద గోదావరి బ్యాక్ వాటర్ రోడ్డును ముంచేతడంతో భద్రాచలం నుండి నెల్లిపాక మీదిగా చతిస్గడ్, ఒరిస్సా వెళ్లాల్సిన వాహనాలు సైతం ఆగిపోయాయి. విస్టా కాంప్లెక్స్ వద్ద గల మోటార్లు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల గోదారి బ్యాక్ వాటర్ భద్రాచలం పట్టణంలోకి ప్రవేశించడం వల్ల ఇస్తా కాంప్లెక్స్, అన్నదాన సత్రం వరద నీటిలో మునిగిపోయాయి.
కర్రకట్ట స్లూయిస్ లు లీక్ అవ్వడం వల్ల రెడ్డి సత్రం కొత్త కాలనీ సుభాష్ నగర్ ప్రాంతాలలో బ్యాక్ వాటర్ రావడంతో పలు గృహాలు వీటిలో మునిగిపోయాయి. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ అంకిత్ గోదావరి కరకట్ట పరిసర ప్రాంతాలను ముంపుకు గురి అయ్యే ప్రాంతాలను స్వయంగా పరిశీలించి సహాయ కాకర మాలు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 15.96 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతున్నది.
తగ్గనున్న గోదావరి వరద
గోదావరి ఎగువ ప్రాంతంలో గోదావరి ఉధృతి తగ్గుతున్నట్లు అధికారికంగా తెలిసింది. దీంతో శనివారం సాయంత్రం నుండి గోదావరి నీటిమట్టం గంట గంటకు తగ్గే అవకాశం ఉందని జలసంఘం అధికారులు పేర్కొన్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు పేరూరు వద్ద నీటిమట్టం 16. 870 మీటర్లలో ప్రవహిస్తూ ఉదయం 11 గంటల నుండి స్వల్పంగా తగ్గుతున్నది. దీంతో గోదావరి నీటిమట్టం ఆదివారం ఉదయానికి పెద్ద ఎత్తున తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.






