19 May, 2026 | 8:40 PM

పశువులపై పెద్దపులి దాడి

19-05-2026 07:10 PM

* ఆందోళనలో స్థానిక ప్రజలు

* రక్షణా చర్యలు చేపట్టాలని అటవీశాఖ అధికారులకు వినతి

అచ్చంపేట: పొలం వద్ద కట్టేసిన పశువుపై పెద్దపులి దాడి చేసి చంపేయడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గ్రామస్తులు బాధిత రైతు వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం శివారు తండా గ్రామానికి చెందిన రైతు పాతావత్ మోత్యా నాయక్ రోజు మాదిరే.. సోమవారం రాత్రి వ్యవసాయ పొలంలో పశువులను కట్టేసి ఇంటికి వచ్చారు. ఉదయం వ్యవసాయ పొలానికి వెళ్లి చూడగా.. ఒక ఎద్దును పెద్దపులి దాడి చేసి చంపేసింది.

దాన్ని సమీపంలోని అడవిలోకి లాక్కెళ్ళింది. పశువును సగం వరకు తినేసింది. ఈ దృశ్యాలన్నీ అటవీశాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో నిక్షిప్తమయ్యాయి. ఘటన స్థలానికి అటవీశాఖ అధికారులు వెళ్లి వివరాలు నమోదు చేసుకున్నారు. దాదాపుగా రైతుల పొలాలన్నీ అమరాబాదు పులుల అభయారణ్యం సమీపంలోనే ఉన్నాయి.

* రైతుకు తీరని నష్టం

మరికొద్ది రోజుల్లోనే దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. దీంతో రైతులు ముందస్తుగానే పొలాలను దుక్కి దున్నే కార్యక్రమాన్ని ఆరంభించారు. ఈ నేపథ్యంలో తన వ్యవసాయానికి ఆసరాగా ఉండే ఎద్దు మరణించడంతో బాధిత రైతు తీవ్ర కన్నీటి భరించమయ్యారు. చనిపోయిన ఎద్దు విలువ రూ. 80 వేలు ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని అధికారులను కోరారు.

* భయాందోళనలో స్థానికులు

ఈ ఘటనతో శివారుతండా, దాని పరిసర గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పంట పొలాల్లోకి వెళ్లాలంటేనే భయంతో వణికిపోతున్నారు.  పశువులపై దాడి చేసిన పెద్దపులి..  మనుషులపై దాడి చేస్తే పరిస్థితి ఏమిటో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది రైతులు పొలాలన్నీ అడవికి సమీపంలో ఉండడంతో  అటవీ ప్రాంతం నుంచి క్రూర జంతువులు, పెద్దపులులు పంట పొలాల్లోకి రాకుండా అటవీ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పొలాల సరిహద్దుల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు తక్షణమే స్పందించి, బాధిత రైతుకు నష్టపరిహారం అందించి, క్షేత్రస్థాయిలో రైతులకు పూర్తి భరోసా ఇవ్వాలని కోరుతున్నారు. ఈ ఘటనపై డివిజన్ అటవీ శాఖ అధికారి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఘటనపై అటవీ సిబ్బంది, పశు వైద్యాధికారులతో కలిసితో  పంచనామా నిర్వహించామని నివేదికను ఉన్నతాధికారులకు పంపించమని చెప్పారు. బాధిత రైతుకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు.