పారిశుధ్యంపై విప్లవాత్మకంగా ముందుకు సాగాలి
జిల్లా కలెక్టర్ కె. హరిత
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): పారిశుధ్యంపై విప్లవాత్మకంగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సమీకృత కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి చెత్తను సేకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాల పరిసరాల్లో పరిశుభ్రతను పాటించడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్లే పారిశుధ్యం లోపించడమే కాకుండా పర్యావరణంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు.
ఎక్కడైనా చెత్త కనిపిస్తే దానిని తీసి డస్ట్‌బిన్‌లో వేయాలని సూచించారు. ఎవరైనా చెత్తను రోడ్డుపై వేస్తే దానిని తీసి డస్ట్‌బిన్‌లో వేయాలని గాంధీజీ సూత్రాన్ని పాటించాలని పేర్కొన్నారు.ప్రజలు బాధ్యతగా తీసుకుని చెత్తను రోడ్డుపై వేయకుండా మున్సిపల్, గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెత్త సేకరణ వాహనాల్లో వేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ దత్తారావు, ఆర్డీవో లోకేశ్వరరావు, డీడబ్ల్యూఓ భాస్కర్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ రమాదేవి, హార్టికల్చర్ అధికారి నదీమ్, వెటర్నరీ అధికారి సురేష్, మత్స్యశాఖ అధికారి సాంబశివరావు తదితర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




