‘మా తండాలు మా రాజ్యం’ సాధించాం..
రెవెన్యూ గ్రామాలే తదుపరి లక్ష్యం
షాద్‌నగర్, జూలై 1 (విజయక్రాంతి): 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు షాద్నగర్లో బుధవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాల్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు.25 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ ఫలితంగానే ‘మా తండాలు మా రాజ్యం’ నినాదం నిజమై, తండాలు గ్రామ పంచాయతీలుగా మారాయని రాంబాల్ నాయక్ పేర్కొన్నారు. తండాలను కేవలం పంచాయతీలుగా మార్చడం మాత్రమే సరిపోదని, ప్రతి తండాకు పూర్తి స్థాయి రెవెన్యూ గ్రామ హోదా దక్కే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీనివల్ల భూముల పరిరక్షణ, ప్రభుత్వ పథకాల అమలు సులువవుతుందన్నారు.
8 కోట్లాది మంది మాట్లాడే లంబాడీల మాతృభాష ‘గోర్ బోలి’ (బంజారా) ను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.గిరిజన విద్యార్థులకు జనాభా ప్రాతిపదికన ఉన్నత విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా గిరిజన సమాజానికి సేవలందించిన పలువురు ప్రముఖులను, వైద్యులను, విద్యావేత్తలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు గిరిజన సంఘాల నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






