25 August, 2026 | 2:04 AM

13 డిమాండ్ల పరిష్కారంతోనే సమ్మెను విరమించాం

25-08-2026 12:46 AM
  1. హామీలు అమలు చేయకుంటే పాలనను స్తంభింప చేస్తాం
  2. ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జమలయ్య

కొత్తగూడెం, ఆగస్టు 24, (విజయక్రాంతి):  సమ్మె నోటీసుపై జరిగిన చర్చల సందర్బంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు చేయాలని, లేనిపక్షంలో  పాలనను స్తంబింపచేసి కార్మికుల సత్తా చాటుతామని ఏఐటీయూసీ అనుబంధ ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జమలయ్య హెచ్చరించారు. కొత్తగూడెంలోని ఏఐటీయూసీ జిల్లా కార్యాలయం ’శేషగిరిభవన్’లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆటో, మోటార్ రంగ కార్మికుల సమస్యలపై హైదరాబాద్లో రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్తో కార్మిక సంఘాల జేఏసీ ఆదివారం జరిపిన చర్చలు సఫలమయ్యాయని తెలిపారు. సమ్మె నోటీసులో 13 ప్రధాన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో రాష్ట్రవ్యాప్త సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి కార్మికుడికి ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసిందన్నారు.

ఆర్టీసీ యాజమాన్యానికి ఈవీ ఆటోలు ఇవ్వాలనే ప్రతిపాదనను విరమించుకోవడంతో పాటు, రవాణా రంగ కార్మికులకు భరోసా కల్పించేలా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని అధికారులు లిఖితపూర్వకంగా అంగీకరించారని పేర్కొన్నారు. టాడు నాయకులు ధర్మపురి నరేష్, టిఆర్‌ఎస్ నాయకులు వీరన్న, బిఎంఎస్ నాయకులు బండారి యాదగిరి మాట్లాడుతూ పెట్రోల్, గ్యాస్ ధరలకు అనుగుణంగా మీటర్ చార్జీల పెంపు, యాప్ సంస్థల అక్రమ దోపిడీ అరికట్టడం,

ప్రమాద బీమా సౌకర్యం వంటి డిమాండ్లపై అధికారులు ఇచ్చిన హామీలను త్వరితగతిన కార్యరూపంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన హక్కుల సాధన దిశగా ఈ ఒప్పందం తొలి విజయమని, ఒకవేళ ఒప్పందాన్ని తుంగలో తొక్కితే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో నాయకులు బత్తుల సత్యనారాయణ, మర్రి కృష్ణ, ఆరెళ్లి కృష్ణ, బడుగు భాస్కర్, బాబా, రాంబాబు, షాకీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.