11 March, 2026 | 7:17 PM

లో-ఓల్టేజ్ నివారణకు కృషి చేస్తున్నాం

11-03-2026 05:48 PM

గుండాల,(విజయక్రాంతి): ఉమ్మడి మండలాలైన ఆళ్లపల్లి, గుండాల మండలాలలో 2024 - 2025 సంవత్సరానికి 2100 కు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ లు మంజూరు చేయడం జరిగిందని, 2025 నుండి ప్రస్తుత 2026 వరకు సుమారు 1600 వ్యవసాయ సర్వీసులు మంజూరు చేయడం జరిగిందని ఏఈ జగదీష్ బాబు, సబ్ ఇంజనీర్ నజీర్ లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. లో-ఓల్టేజ్ సమస్య నివారణకు మండల కేంద్రంలో గల గుండాల సబ్ స్టేషన్ లో ఒక 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఉండగా, అదనంగా 90 లక్షలతో మరొక 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేయటం జరిగింది.

అలాగే మామకన్ను సబ్ స్టేషన్ లో రెండు 3.15 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ లు ఉండగా, వాటి స్థానంలో రెండు 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ లు 1.80 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. గుండాల సబ్ స్టేషన్ కు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న 132/33 కేవీ ఇల్లందు సబ్ స్టేషన్ నుండి 33 కేవీ సప్లై సరఫరా జరుగుతున్నదని, దూరం ఎక్కువగా ఉండడం వల్ల లో-ఓల్టేజ్ సమస్య వస్తున్నదని, దానిని నివారించుటకు గుండాల సబ్ స్టేషన్ లో 70 లక్షల వ్యయంతో రెండు 5 ఎంవీఏ బూస్టర్ ట్రాన్స్ఫార్మర్లు మరియు మామకన్ను సబ్ స్టేషన్ లో 35 లక్షల వ్యయంతో ఒక బూస్టర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

60 లక్షల వ్యయంతో 11 కేవీ ఫీడర్ల మీద లోడ్ తగ్గించుటకు రెండు సబ్ స్టేషన్ లలో రెండు కెపాసిటర్ బ్యాంక్ ల చొప్పున ఏర్పాటు చేయడం జరిగిందని, అదే విధంగా 11 కేవీ లైన్ లలో ప్రతీ ఫీడర్ కు మూడు చొప్పున మొత్తం 25 లక్షలతో 600 కేవీఏఆర్ కెపాసిటర్ లు ఏర్పాటు చేయడం తెలిపారు. ఈ సంవత్సరం కాచనపల్లి, సాయనపల్లి, ముత్తాపురం గ్రామాలలో 33/11 కేవీ సబ్ స్టేషన్లు మంజూరు చేయడం జరిగిందని, దానికి సంబంధించిన పనులు ఏప్రిల్ నెలలో మొదలు పెట్టడానికి కృషి చేస్తున్నామని వారు పేర్కొన్నారు. మండలంలో 132/33 కేవీ నూతన సబ్ స్టేషన్ కొరకు కూడా ప్రపోజల్ పంపించడం జరిగిందని వారు ప్రకటనలో తెలియజేశారు.