అభిమానిని పరామర్శించిన పవన్ కళ్యాణ్
హనుమకొండ,(విజయక్రాంతి): ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హన్మకొండలో బుధవారం పర్యటించారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న తన వీరాభిమాని నిరంజన్(Niranjan Residence)ను పరామర్శించి, అతని కోరికను నెరవేర్చడానికి ఆయన స్వయంగా హనుమకొండలోని నిరంజన్ ఇంటికి వెళ్లారు. హనుమకొండలోని హనుమాన్ నగర్ కు చెందిన 17 ఏళ్ల నిరంజన్, “డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ"(Duchenne Muscular Dystrophy) అనే అరుదైన జన్యుపరమైన నరాల వ్యాధితో బాధపడుతున్నాడు.
తన అభిమాన నాయకుడైన పవన్ కళ్యాణ్ ను ఒక్కసారైనా కలవాలన్న నిరంజన్ చివరి కోరికను మన్నించి, పవన్ కళ్యాణ్ అతని ఇంటికి వెళ్లి దాదాపు 45 నిమిషాల పాటు బాలుడితో, అతని కుటుంబ సభ్యులతో గడిపారు. ఈ పర్యటన పూర్తిగా మానవతా దృక్పథంతో, అభిమాని పట్ల చూపిన ప్రేమతో సాగింది. పవన్ కళ్యాణ్ రాకతో ఆ బాలుడి కుటుంబంలో, స్థానిక జనసేన పార్టీ నాయకులలో, అభిమానులలో పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమైంది. పవన్ కళ్యాణ్ ను చూసేందుకు స్థానిక యువకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో హనుమాన్ నగర్ ప్రాంతంలో ఉదయం నుండే సందడి నెలకొన్నది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.






