17 June, 2026 | 2:58 PM

ముగ్గురు మోసగాళ్ల పాలనలో ఖమ్మం జిల్లా ఆగం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

17-06-2026 01:24 PM

ఖమ్మం జిల్లా మంత్రులపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

పాలేరు: ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పర్యటించారు. సర్ ప్రక్రియపై పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ బీఎల్ వోలకు అవగాహన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా మంత్రులపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ముష్కరుల పాలనలో తెలంగాణ విలవిల్లాడుతోందని కేటీఆర్ తెలిపారు. రైతులకు రైతుబంధు లేదు, యూరియా లేదు, కరెంట్ లేదన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆదాయం(Telangana State Revenue), ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని ఆరోపించారు. రాష్ట్ర రెవెన్యూ  తగ్గుతోంది.. రెవెన్యూ మంత్రి అవినీతి పెరుగుతుందని తెలిపారు.

కష్టపడి పంటలు పండించినా ధాన్యం కొనుగోలు చేయడం లేదని ధ్వజమెత్తారు. వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్తుంటే వ్యవసాయ మంత్రి అక్రమాలు మాత్రం రోజుకొకటి బయటకొస్తున్నాయని వెల్లడించారు. ముగ్గురు మోసగాళ్ల పాలనలో ఖమ్మం ఆగమవుతోందని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంటే ఆర్థిక మంత్రి కమీషన్ల దందా మాత్రం జోరుగా కొనసాగుతోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలవదని ఆ పార్టీ నేతలకు అర్థమైపోయిందన్న కేటీఆర్ బాంబుల మంత్రి అక్రమ సంపాదన భారీగా పెరిగిందని ఆరోపించారు. మంత్రి పొంగులేటి అక్రమాలపై కేటీఆర్ వీడియో ప్రదర్శన చేశారు. బాండ్ పేపర్లు, గ్యారెంటీ కార్డులతో ప్రజలను మోసం చేశారని కేటీఆర్ విమర్శించారు.