యూరియా యాప్ రద్దు చేయాలంటూ.. భిక్కనూర్‌లో బీఆర్ఎస్ ధర్నా
భిక్కనూర్, జూన్ 17(విజయ క్రాంతి): యూరియా పంపిణీ కోసం అమలు చేస్తున్న ఆన్‌లైన్ యాప్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భిక్కనూర్ సినిమా టాకీస్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు, రైతులు భారీ ధర్నా నిర్వహించారు. యాప్ కారణంగా స్మార్ట్‌ఫోన్లు లేని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గతంలో అమలులో ఉన్న ఎకరాల వారీ పర్మిట్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
శనివారం ఎంఏవో నాగరాజు మండలంలోని వివిధ సొసైటీల్లో 4,002 యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు యాప్ ద్వారా బుకింగ్ ప్రారంభమవుతుందని ప్రకటించారు. అయితే రైతులు గంటల తరబడి ఎదురుచూసినా, యాప్ ప్రారంభమైన కొద్ది సెకన్లలోనే “ఇన్‌సఫిషియెంట్ స్టాక్” సందేశం రావడంతో ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం కూడా పలు సొసైటీల వద్ద రైతులు నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే.
బుధవారం బీఆర్ఎస్ శ్రేణులు సినిమా టాకీస్ చౌరస్తాలో ధర్నాకు దిగుతూ “యూరియా యాప్ డౌన్ డౌన్”, “సీఎం డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేయగా, కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. తమ డిమాండ్లపై అధికారులు హామీ ఇచ్చే వరకు కదిలేది లేదంటూ నాయకులు భైఠాయించారు.
సుమారు గంటపాటు ఆందోళన కొనసాగిన అనంతరం ఏడీఏ అపర్ణా ధర్నా స్థలానికి చేరుకుని రైతుల సమస్యలను విని వినతిపత్రాన్ని స్వీకరించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు యాప్ ప్రతిరూపాన్ని దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. సుమారు రెండు గంటల పాటు కొనసాగిన ధర్నా అనంతరం ముగిసింది. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని, పాత పర్మిట్ విధానాన్ని అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.ఈ ధర్నా లో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.






