ఆరుట్ల గ్రామం తెలంగాణకే ఆదర్శం, స్ఫూర్తి: సీఎం రేవంత్
ప్రభుత్వ పాఠశాలల ద్వారా మట్టిలో మానిక్యాలను వెలికితీస్తాం
ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం నామోషీ అనే ఆలోచన పోవాలి
విద్యారంగంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుతాం
ఆరుట్ల: రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో(Arutla) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పర్యటిస్తున్నారు. ఆరుట్లలో రూ. 15 కోట్లతో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్(Telangana Public School) ను సీఎం ప్రారంభించారు. అనంతరం స్కూల్ విద్యార్థులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాల నిర్మాణం చేపట్టింది. ఆరుట్లలో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ... విద్యాశాఖపై ఈ ప్రభుత్వం రూ. 27 వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యపై తల్లిదండ్రులకు అపోహలు ఉన్నాయని తెలిపారు. అందరి అపోహలు తొలగించేందుకే టీపీఎస్ నిర్మాణాన్ని చేపట్టామని వివరించారు. విద్య వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు విద్య కమిషన్ వేసినట్లు పేర్కొన్నారు.
విద్య మాత్రమే మన జీవితాలను సమూలంగా మార్చగలదని వెల్లడించారు. సమాజంలో అసమానతలు పోవాలంటే అందరికీ నాణ్యమైన విద్య అవసరం అన్నారు. ఆరుట్ల పాఠశాలను పైలట్ ప్రాజెక్టుగా నిర్మించామని చెప్పారు. ఆరుట్ల గ్రామం తెలంగాణకే ఆదర్శం, స్ఫూర్తి అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల ద్వారా మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం నామోషీ అనే ఆలోచన పోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ బడుల్లో చదివి ఐఏఎస్, ఐపీఎస్, సీఎంలు అయినవాళ్లు ఉన్నారని వివరించారు. గత ప్రభుత్వం వర్గానికికొక స్కూల్ పెట్టి.. కుల వ్యవస్థను ప్రోత్సహించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంటూ కులానికొక స్కూల్ పెట్టారని మండిపడ్డారు. కుల వ్యవస్థను నిర్మూలించేందుకే ఇంటిగ్రేటెడ్ స్కూల్లు నిర్మిస్తున్నామని తెలిపారు. త్వరలోనే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తామన్నారు.
మెస్సీని హైదరాబాద్ కు తీసుకువస్తే.. విమర్శలు చేశారని తెలిపారు. క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపేందుకే మెస్సీని తీసుకువచ్చామని చెప్పారు. మెస్సీ.. డ్రగ్స్ ముఠా లీడర్ కాదు.. ఆర్థిక నేరగాడు కాదన్నారు రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం యూనిఫామ్ లు ఇస్తే.. నెల రోజులకే చినిగిపోయాయని ఆరోపించారు. ఈ ప్రజా ప్రభుత్వం నాణ్యమైన వస్తువులతో విద్య కిట్ ఇస్తోందన్నారు. విద్యాకిట్ పంపిణీ కోసం రూ. 680 కోట్ల టెండర్లకు పలిచామని వెల్లడించారు. రూ. 680 కోట్ల టెండర్లలో రూ. 2 వేల కోట్ల స్కామ్ జరిగిందని ఒకాయన అంటున్నారన్న సీఎం రేవంత్, రూ. 680 కోట్ల టెండర్లలో రూ. 2 వేల కోట్ల స్కామ్ ఎలా సాధ్యమూ చెప్పాలి? అని ప్రశ్నించారు. విద్యారంగంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.






