పూరీలు చేసి.. ఫుట్‌బాల్ ఆడి
ఆరుట్లలో 'తెలంగాణ పబ్లిక్ స్కూల్'ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
రంగారెడ్డి, జూన్ 17(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక 'ఫ్రీ బ్రేక్ఫాస్ట్' పథకంలో భాగంగా రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో నూతనంగా ఏర్పాటు చేసిన తొలి 'తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీస్)'ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన సీఎం.. పాఠశాల సిబ్బందితో కలిసి స్వయంగా పూరీలు వండి, విద్యార్థులతో గిటార్ వాయించి, ఫుట్బాల్ ఆడి సందడి చేశారు. ప్రభుత్వ పాలన ప్రతి బిడ్డకు చేరినప్పుడే దానికి నిజమైన సార్థకత లభిస్తుందని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
తెలంగాణ విద్యావ్యవస్థలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న 'తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS)' విద్యా విప్లవానికి రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో శ్రీకారం చుట్టారు. తొలి టీపీఎస్ స్కూల్‌ను బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ, ఉపాధ్యాయులు మరియు స్థానికులతో సీఎం కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించి, పాఠశాల వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.
వంటగదిలో పూరీలు చేసి.. గ్రౌండ్‌లో ఫుట్‌బాల్ ఆడి..
పాఠశాల ప్రారంభోత్సవం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి వినూత్నంగా గడిపారు. మొదట కిచెన్ సిబ్బంది వద్దకు వెళ్లిన ఆయన, వారితో కలిసి స్వయంగా పూరీలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత విద్యార్థుల పక్కన కూర్చొని ఆప్యాయంగా పలకరిస్తూ వారితో కలిసి అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్) చేశారు. కేవలం వంటకానికే పరిమితం కాకుండా, స్కూల్‌లోని మ్యూజిక్ రూమ్‌ను సందర్శించి స్వయంగా గిటార్ వాయించారు. అనంతరం స్కూల్ ప్లే గ్రౌండ్‌లోకి దిగి విద్యార్థులతో కలిసి కాసేపు ఉత్సాహంగా ఫుట్‌బాల్ ఆడారు. ప్రతి బిడ్డకు పాలన చేరడమే సార్థకత అని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. "ప్రభుత్వ పాలన ప్రతి బిడ్డకు చేరినప్పుడే దానికి నిజమైన సార్థకత లభిస్తుంది" అని వ్యాఖ్యానించారు. చదువుల తల్లుల ఆకలి తీరుస్తూ.. వారి ఉజ్వల ప్రగతికి బాటలు వేస్తున్న ఈ ఉచిత బ్రేక్‌ఫాస్ట్ పథకం మరియు నాణ్యమైన విద్యా విధానం అందరి ప్రశంసలు అందుకుంటోందని హర్షం వ్యక్తం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా మొత్తం 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను (TPS) ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే ఆరుట్లలో తొలి స్కూల్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు.






