27 July, 2026 | 2:25 AM

బురదమయమైన రోడ్లు అవస్థలు పడుతున్న ప్రజలు

27-07-2026 01:24 AM

తాంసి/భీంపూర్, జూలై 26 (విజయక్రాంతి): ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో ఆదిలాబాద్ - కరంజి(టి), గుబిడి వరకు 50 కిలో మీటర్ల ఆర్ అండ్ బీ రోడ్డు వర్షాలతో బురదమయం అయ్యింది. ధనోరా నుంచి కరంజి, ఆ తరువాత గుబిడి వరకు అయితే రోడ్డుపై వాహనాలు ప్రయాణించలేని పరిస్థితి ఉన్నది. ఈ రోడ్డుపై సాధారణంగా గంటన్నర ప్రయాణ సమయం తీసుకునే ఆర్టీసీ బస్సులు ఇప్పుడు రోడ్ల అద్వాన్న పరిస్థితితో మూడు గంటల సమయం తీసుకుంటున్నాయి.

ఇక మారుమూల ఆదివాసీ ఆవాసాలు వడ్గాం నుంచి గుబిడిపల్లి వరకు ఐదు కిలో మీటర్ల మట్టి రోడ్డుపై పాదాచారులు నడవలేని పరిస్థితి దాపురించింది. రోడ్డు బాగా లేక, మరోవైపు బస్సులు లేక గుబిడి, కొజ్జన్ గూడ, తెకిడి రాంపూర్ వాసులు కాలినడకనే కరంజి వరకు ఎనిమిది కిలో మీటర్లు వచ్చి ఆ తరువాత మండల, జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సి వస్తుంది. వర్షం పడిన ప్రతిసారీ ఇదే పరిస్థితి పునరావృతమవుతోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి, తాత్కాలికంగా మట్టి, గ్రావెల్ వేయించడమే కాకుండా శాశ్వతంగా రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.