2 April, 2026 | 3:03 AM

మహిపాల్‌రెడ్డి అవినీతి సామ్రాజ్యాన్ని బద్దలు కొడతా

02-04-2026 01:07 AM

కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక

ఎమ్మెల్యే భూదందాల చిట్టా విప్పిన కాంగ్రెస్ నేత

పటాన్‌చెరు రాజకీయాల్లో మళ్లీ మాటల యుద్ధం

పటాన్‌చెరు, ఏప్రిల్ 1 : పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో సంచలన ఆరోపణలు చేశారు. మహిపాల్ రెడ్డి అవినీతి సామ్రాజ్యాన్ని బద్దలు కొడతానని, ఆయన అవినీతి బాగోతాన్ని పూర్తిగా బయటపెడతానని హెచ్చరించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన స్థాయి గురించి మాట్లాడే అర్హత మహిపాల్ రెడ్డికి లేదని కాటా శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.

పార్టీలు మారడం, భూకబ్జాలు చేయడమే ఆయన స్థాయి అని ఎద్దేవా చేశారు. తమ కుటుంబం ఆస్తులు అమ్ముకుని పేదలకు అండగా నిలిచిన చరిత్ర కలిగినదని, నియోజకవర్గంలో తమ కుటుంబం పేరుతో కాలనీలు ఉన్నాయని గుర్తు చేశారు. నీకు రాజకీయ భిక్ష పెట్టిందే కాటా కుటుంబమని, అలాంటి కుటుంబంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని హెచ్చరించారు. మాజీ సీఎం కేసీఆర్తో తమ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే చేస్తున్న భూదందాలను ఆధారాలతో బయటపెడతానని తెలిపారు. సర్వే నంబర్ 62లో శంకర్ లాల్కు కేటాయించిన భూమిలో ప్లాట్లు వేశారని ఆరోపించారు. 64, 65 సర్వే నంబర్లకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంద్రేశం పరిధిలోని 453, 178 సర్వే నంబర్లలో ప్లాట్లు వేసి వందల కోట్లు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆస్తులకు సంబంధించి ఈడీ అటాచ్ చేసిన పత్రాలను కూడా బహిరంగపరిచినట్లు తెలిపారు. నెలకు రెండు లక్షల జీతం వచ్చే వ్యక్తి వేల కోట్లు ఎలా సంపాదించారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

శివాలయంలో ప్రమాణానికి సవాల్..

మున్సిపల్ చైర్మన్ పదవి కోసం తాను డబ్బులు తీసుకున్నానన్న ఆరోపణలను నిరూపించాలని మహిపాల్ రెడ్డికి సవాల్ విసిరారు. ఆరోపణలు నిజమైతే బీరంగూడ శివాలయంలో ఉదయం 11 గంటలకు పసుపు బట్టలతో ప్రమాణం చేద్దామని బహిరంగ సవాల్ విసిరారు. తన సర్పంచ్ పదవిని మాజీ మంత్రి హరీశ్ రావుతో కలిసి మహిపాల్ రెడ్డి తొలగించారని ఆరోపించారు. మహిపాల్ రెడ్డి మూడు సార్లు వెన్నుపోటు రాజకీయాలతోనే గెలిచారని కాటా శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.

ఎన్నికలకు పది రోజుల ముందు తనకు బీ-ఫారం వచ్చి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రెండేళ్లలో ఎమ్మెల్యే అవినీతి బాగోతాన్ని పూర్తిగా బయటపెడతానని హెచ్చరించారు. అవసరమైతే తన ప్రాణ త్యాగానికైనా సిద్ధమని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కాటా శ్రీనివాస్ గౌడ్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు పటాన్చెరు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.