17 July, 2026 | 2:04 AM

ఒకే ఇంటి నంబరుపై 79 ఓట్లు

17-07-2026 12:00 AM

బాకారం జాగీర్లో ఓటర్ల జాబితాపై అనుమానాలు

మొయినాబాద్, జూలై 16 (విజయ క్రాంతి): మొయినాబాద్ మండలంలోని బాకారం జాగీర్ గ్రామపంచాయతీ పరిధిలో ఓటర్ల జాబితాలో తీవ్ర అక్రమాలు చోటుచేసుకున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామంలోని ఇంటి నంబర్ 5-1పై ఏకంగా 79 మంది ఓటర్లు నమోదు కావడం ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒకే ఇంటి నంబరుపై అసాధారణ రీతిలో ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లు ఉండటాన్ని గ్రామ సర్పంచ్ వెంకటేష్ గౌడ్, వార్డు సభ్యులు గుర్తించి, ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

క్షేత్రస్థాయి పరిస్థితికి, జాబితాకు పొంతన లేదు..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... సదరు ఇంటిలో నివసిస్తున్న వారి సంఖ్యకు, ఓటర్ల జాబితాలో నమోదైన ఓట్ల సంఖ్యకు అస్సలు పొంతన లేదు. అంతేకాకుండా, ప్రస్తుతం యెంకెపల్లి (ఎన్కెపల్లి) శివారు ప్రాంతంలో నివసిస్తున్న కొందరి ఓట్లు కూడా ఇంకా బాకారం జాగీర్ పరిధిలోనే కొనసాగుతుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్ల జాబితా పారదర్శకత అత్యంత కీలకం. ఒకే ఇంటి నంబ్ప 79 ఓట్లు నమోదు కావడం విస్మయానికి గురిచేస్తోంద ని గ్రామస్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు విచారణ చేపట్టాలి:

ఈ తీవ్రమైన అంశంపై ఎన్నికల అధికారులు, బూత్ స్థాయి అధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరపాలని సర్పంచ్ వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు. డూప్లికేట్ లేదా తప్పుగా నమోదైన ఓట్లను తక్షణమే తొలగించి, తప్పులు లేని పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించాలని ఆయన కోరారు.

అలాగే, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ  కార్యక్రమాన్ని ఓటర్లందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు వివరాలను, నివాస చిరునామాను సరిచూసుకొని, ఏవైనా తప్పులు ఉంటే వెంటనే మార్పులు చేయించుకోవాలని కోరారు.