22 August, 2026 | 9:39 PM

వినాయక నవరాత్రులు ఘనంగా నిర్వహించాలి

22-08-2026 08:28 PM

- మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనుషా

ఆదిలాబాద్,(విజయక్రాంతి): వినాయక నవరాత్రులకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనుషా కోరారు. శని వారం మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనుషా అధ్యక్షతన నిర్వహించిన అదిలాబాద్ పురపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో రాబోయే వినాయక నవరాత్రులను పురస్కరించుకుని పట్టణంలో అవసరమైన ఏర్పాట్లపై సమావేశంలో విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనుషా మాట్లాడుతూ... అదిలాబాద్ పట్టణంలోని 49 వార్డుల్లో వినాయక నవరాత్రులను అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు మున్సిపల్ పరిపాలన తరఫున అవసరమైన అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు.

పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో గ్రావెల్, మోరం, డస్టు, వెట్ మిక్స్ కోసం రూ. 10 లక్షలు, సీసీ ప్యాచ్‌వర్క్‌ల కోసం మరో రూ.10 లక్షలు కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా లైటింగ్, అంబేద్కర్ చౌక్ వద్ద స్టేజ్ ఏర్పాట్లు, పెన్‌గంగా నది వద్ద క్రేన్‌లు, లైటింగ్, చాందావాగు వద్ద క్రేన్‌లు, లైటింగ్‌తో పాటు అన్ని బారికేడ్ల ఏర్పాటుకు సుమారు రూ. 34.50 లక్షలతో కూడిన ప్రతిపాదనలకు మున్సిపల్ పరిపాలన అనుమతులు పొందినట్లు తెలిపారు.

వినాయక నవరాత్రులు సమీపిస్తున్న నేపథ్యంలో అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసి, అవసరమైన నిధులకు సంబంధించి కౌన్సిల్ తీర్మానం తీసుకున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా పట్టణంలోని 49 వార్డుల్లో గణేష్ మండపాలు, ప్రధాన చౌరస్తాల వద్ద లైటింగ్ వ్యవస్థను పటిష్టంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. శానిటేషన్ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, బ్లీచింగ్, క్లీనింగ్ తదితర పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.

వినాయక నవరాత్రుల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో పరిశుభ్రత, వెలుగులు, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లు సక్రమంగా ఉండేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని చైర్‌పర్సన్ సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రోహిత్, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం తదితర పార్టీలకు చెందిన కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.