22 August, 2026 | 10:58 PM

ఆసిఫాబాద్‌లో 10+2 కోర్టుల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి

22-08-2026 09:35 PM

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నాగేష్‌కు ఆసిఫాబాద్ బార్ అసోసియేషన్ ప్రతినిధుల వినతి

ఆసిఫాబాద్(విజయక్రాంతి): న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు సత్వర న్యాయం అందించేందుకు రాష్ట్రంలో న్యాయస్థానాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో 10+2 కోర్టుల భవన సముదాయాన్ని నిర్మించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నాగేష్‌ను ఆసిఫాబాద్ జిల్లా బార్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.

ఈ సందర్భంగా  బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఆయనను కలిసి జిల్లా న్యాయస్థానాల సమస్యలను వివరించారు.ఆసిఫాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో సుమారు ఎనిమిది ఎకరాల స్థలం అందుబాటులో ఉందని, జిల్లా గిరిజన ప్రాంతం కావడంతో ప్రజలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని వారు వివరించారు. జిల్లాలో కేసుల సంఖ్యకు అనుగుణంగా న్యాయస్థానాల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఖాళీగా ఉన్న కోర్టు భవనంలో అట్రాసిటీ కోర్టును వెంటనే ప్రారంభించాలని కోరారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి  శారదాదేవి మాట్లాడుతూ కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కోర్టుల ప్రాంగణంలో ఖాళీగా ఉన్న స్థలంలో 10+2 కోర్టుల భవన సముదాయాన్ని నిర్మించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేసేలా సహకరించాలని జస్టిస్ భీమపాక నాగేష్‌ను కోరారు. దీనిపై స్పందించిన జస్టిస్ భీమపాక నాగేష్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శారదాదేవితో సమన్వయం చేసుకొని ప్రతిపాదనలు సిద్ధం చేసి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నివేదిక సమర్పించాలని సూచించారు. అనంతరం జస్టిస్ భీమపాక నాగేష్‌ను ఆసిఫాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాలువా, పూలగుచ్ఛంతో సత్కరించి, స్వామి వివేకానంద విగ్రహాన్ని జ్ఞాపికగా అందజేశారు.

న్యాయవాద వృత్తిలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న  సురేష్‌ను  జస్టిస్ భీమపాక నాగేష్ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శారదాదేవి, సీనియర్ సివిల్ జడ్జి సాకేత్ మిత్రా, జూనియర్ సివిల్ జడ్జి అనంతలక్ష్మి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భువనగిరి సతీష్ బాబు, తాడేపల్లి సురేష్, ముక్త సురేష్, జగన్మోహన్, హరీష్ కొడియార్, జంజర్ల శ్యామ్‌కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహల్కార్ శ్రీనివాస్, చంద్రకుమార్, రాజు రెడ్డి, మంతెన చరణ్ తేజ, రవ్నక్ అగర్వాల్, పి. నరహరి, కుంరం లాల్‌చ, ఎగురపు సంజీవ్, జుమ్మిడి రాజేష్, జాడి విద్యాసాగర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.