8 May, 2026 | 6:53 AM

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

08-05-2026 12:00 AM

ఇంటి నిర్మాణ అనుమతికి ఫోన్ పేలో రూ.5వేలు లంచం

సుల్తానాబాద్, మే 7 (విజయక్రాంతి): ఇంటి నిర్మాణ అనుమతుల కోసం గ్రామపంచాయతీ కార్యదర్శి రూ. 5వేలు లంచం తీసుకొని ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. అనుమతికి కార్యదర్శి కుమారస్వామి రూ. 20వేలను డిమాండ్ చేశాడు.

అనంతరం రూ. 15వేలకు ఒప్పుకున్నాడు. బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనల మేరకు గురువారం ఫోన్‌పే ద్వారా రూ. 5వేలను కార్యదర్శికి చెల్లించాడు. వెంటనే అధికారులు కార్యదర్శిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్, సీఐలు తిరుపతి, పున్నం చందర్, ప్రేమ్ కుమార్‌లు పాల్గొన్నారు. కుమారస్వామిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.