పుస్తకాల దందాపై శ్రీ చైతన్యకు షాక్.. స్కూల్‌లో గోడౌన్లు సీజ్
ఖమ్మం ఎడ్యుకేషన్,(విజయక్రాంతి): ఖమ్మం నగరంలోని మమతా రోడ్డులో ఉన్న శ్రీ చైతన్య ఒలంపియాడ్ స్కూల్‌లో విద్యాశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, పాఠ్యపుస్తకాల రెండు గోడౌన్లను సీజ్ చేశారు. విద్యార్థి సంఘాల ఫిర్యాదు మేరకు అడిషనల్ కలెక్టర్, డీఈవో ఆదేశాలతో ఎంఈవో శైలజ ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టారు. పాఠశాల లోగోలతో కూడిన పుస్తకాలు, నోట్‌బుక్స్‌ను అధిక ధరలకు విద్యార్థులకు విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ PDSU, AISA, MSF, BSF(I) తదితర విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు.
నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల ప్రాంగణంలోనే పుస్తకాల విక్రయాలు నిర్వహిస్తూ తల్లిదండ్రుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా వ్యాపారం కొనసాగుతోందని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. అక్రమాలకు పాల్పడుతున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అధిక ధరలకు పుస్తకాల విక్రయాలను పూర్తిగా అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తనిఖీల అనంతరం అధికారులు రెండు పుస్తకాల గోడౌన్లను సీజ్ చేసి, సంబంధిత రికార్డులను స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటన ఖమ్మం నగరంలో చర్చనీయాంశంగా మారింది.






