17 June, 2026 | 5:07 AM

టీజీ20 బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్‌దేవరకొండ

17-06-2026 12:19 AM

విజేతకు రూ. కోటి ప్రైజ్‌మనీ

రన్నరప్ జట్టుకు రూ.50 లక్షలు

టికెట్ ధర రూ.50, రూ.100

హైదరాబాద్, జూన్ 16: తెలంగాణలోని యువ క్రికెటర్ల ప్రతిభను గుర్తించడమమే లక్ష్యంగా హెచ్‌సీఏ నిర్వహిస్తున్న టీజీ20 లీగ్‌కు టాలీవుడ్ హీరో విజయ్‌దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నా డు. శ్రీనిధి యూనివర్సిటీ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుండగా నిర్వాహకులు టోర్నీ ప్రైజ్‌మనీతో పాటు టికెట్ల ధరలను వెల్లడించారు.

మొత్తం రూ.2 కోట్ల ప్రైజ్‌మనీతో టీజీ20 లీగ్ నిర్వహిస్తున్నారు. విజేతగా నిలిచిన జట్టుకు రూ.కోటి, రన్నరప్‌కు రూ.50 లక్షలు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచే జట్లకు రూ.25 లక్షల చొప్పున ప్రైజ్‌మనీ లభించనుంది. జూన్ 21న ఉప్పల్ స్టేడియం వేదికగా లీగ్ మొదలుకానుండగా.. ఆరంభ వేడుకల్లో మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌తో ప్రత్యేక ప్రదర్శన ఉంటుందని టీజీ20 లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ ఆగమరావు చెప్పారు.

ఇంపాక్ట్ ప్లేయర్స్ రూల్ తప్ప మిగిలిన అన్ని ఐపీఎల్ రూల్స్ ఈ లీగ్‌లో ఉంటాయని తెలిపారు. కాగా ఈ టోర్నీకి మరింత ఆదరణ కల్పించే ఉద్దేశంతో అభిమానుల కోసం టికెట్ ధరలను రూ.50, రూ.100 గా నిర్ణయించామన్నారు. లీగ్‌కు సంబంధించిన ట్రోఫీని బుధవారం ట్యాంక్ బండ్‌పై ఆవిష్కరించనున్నారు. టీజీ20 లీగ్‌లో మొత్తం 8 జట్లు పోటీపడుతుండగా భారత క్రికెటర్లు సిరాజ్, తిలక్‌వర్మ కూడా ఆడనున్నారు.