జిల్లాలో వర్షాల వేళ పాఠశాలల్లో అప్రమత్తత తప్పనిసరి
పరిశుభ్రత, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి
అధికారులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశం
పెద్దపల్లి, ఆగస్టు 01 (విజయక్రాంతి): వర్షాకాలం నేపథ్యంలో ప్రభుత్వ మోడల్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో విద్యార్థుల భద్రత, పరిశుభ్రత, నాణ్యమైన విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(Collector Koya Sriharsha) అధికారులను ఆదేశించారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్, కేజీబీవీ, యూఆర్ఎస్ స్పెషల్ ఆఫీసర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
వర్షాల కారణంగా పాఠశాలలు, వసతి గృహాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. పాములు, తేళ్లు, దోమలు, ఈగల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు తరగతి గదులు, వసతి గదులు, వంటశాలలు, మరుగుదొడ్లు, పాఠశాల ఆవరణను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. మిషన్ భగీరథ ద్వారా సరఫరా అయ్యే తాగునీటిని ప్రతి 15 రోజులకు ఒకసారి పరీక్షించి విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందేలా చూడాలని సూచించారు. మండల, గ్రామస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు.
విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపునకు ఉపాధ్యాయులు నాణ్యమైన బోధన అందించాలని, ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా వంటి డిజిటల్ విద్యా వనరులను వినియోగించి అభ్యాస సామర్థ్యాలను మెరుగుపరచాలని కలెక్టర్ సూచించారు. అలాగే ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్) నమోదు వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు విద్యార్థుల హాజరు, విద్యా పురోగతి, ఆరోగ్యం, క్రమశిక్షణ అంశాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి శారద, సంబంధిత శాఖల అధికారులు, మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్, కేజీబీవీ, యూఆర్ఎస్ స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.






