వరి వద్దు.. ఆరుతడి పంటలే ముద్దు
– రైతులకు వ్యవసాయ శాఖ కీలక సూచనలు
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో తేలికపాటి వర్షాలు కురవడంతో వరి సాగు వైపు వెళ్లొద్దని రైతులకు వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం పడిన వర్షాలకు వరి నాట్లు వేస్తే చివరి దశలో నీటి కొరత కారణంగా భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. అందువల్ల తక్కువ నీటితో పండే కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు, కూరగాయల వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు.
అలాగే పడిన వర్షపు నీటిని ఫార్మ్ పాండ్లు, బోర్‌వెల్ రీఛార్జ్ పిట్ల ద్వారా భూమిలోనే నిల్వ చేసుకోవాలని, దీనివల్ల భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా మండపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న కూరగాయల తోటలను జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం పరిశీలించారు. గ్రామ రైతులు కూరగాయల సాగు వైపు మొగ్గు చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి సంజీవ్, వ్యవసాయ విస్తరణ అధికారి గంగా, మండేపల్లి గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్, కడారి ప్రతాప్ రెడ్డి, దుర్ముట్ల లచ్చి రెడ్డి, దేవచంద్రం,సీఆర్పీలు, రైతులు పాల్గొన్నారు.






