మంథని–జేఎన్‌టీయూ కళాశాలకు ఆర్టీసీ బస్సులు నడపాలి
మంత్రి శ్రీధర్ బాబు, ఆర్టీసీ అధికారులకు విద్యార్థులు–సిబ్బంది వినతి
మంథని,(విజయక్రాంతి): రామగిరి మండలం పన్నూరు గ్రామంలోని జేఎన్‌టీయూహెచ్ యూనివర్శిటీ కళాశాల ఆఫ్ ఇంజినీరింగ్‌కు మంథని బస్టాండ్ నుంచి నేరుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో పాటు ఆర్టీసీ అధికారులను కోరారు. ఈ మేరకు మంథనిలో మంథనిలో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేయగా, కరీంనగర్ రీజినల్ మేనేజర్, డిప్యూటీ రీజినల్ మేనేజర్‌లకు వాట్సాప్ ద్వారా కూడా విజ్ఞప్తి పంపించారు.
ప్రస్తుతం మంథని, పరిసర ప్రాంతాల నుంచి దాదాపు 20 మంది విద్యార్థులు, 25 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది ఆర్టీసీ బస్సుల్లో పన్నూరు ఎక్స్‌రోడ్ వరకు ప్రయాణించి, అక్కడి నుంచి సుమారు కిలోమీటరున్నర దూరం కాలినడకన కళాశాలకు చేరుకోవాల్సి వస్తోందని తెలిపారు. ఎండ, వర్షం, చలి కాలాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ముఖ్యంగా మహిళా అధ్యాపకులు, విద్యార్థినులు భద్రతా సమస్యలతో పాటు సమయానికి కళాశాలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమస్యను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. విష్ణువర్ధన్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి మంత్రి శ్రీధర్‌బాబు, ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్, మంథని డిపో మేనేజర్‌లకు వినతిపత్రాలు పంపించినట్లు తెలిపారు. మంథని–పెద్దపల్లి మార్గంలో జేఎన్‌టీయూ కళాశాల మీదుగా ఉదయం కళాశాల ప్రారంభ సమయానికి, సాయంత్రం కళాశాల ముగింపు సమయానికి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలని కోరారు.
కళాశాలలో చదువుతున్న విద్యార్థులు, విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో ప్రతిరోజూ ప్రజా రవాణాపైనే ఆధారపడుతున్నారని, తగిన బస్సు సౌకర్యం కల్పిస్తే వారి ప్రయాణ కష్టాలు తీరడంతో పాటు సమయపాలన కూడా మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు సింగారపు శివరామకృష్ణ, ఎస్. కుమార్, విద్యార్థుల తల్లిదండ్రులు పెండ్యాల రామ్‌కుమార్, చెన్నోజు రమేష్, ఏరువాక శ్రీనివాస్, విద్యార్థులు పెండ్యాల శ్రీనిధి, చెన్నోజు అఖిల, సిబ్బంది మాడిశెట్టి లక్ష్మీనారాయణ, చల్ల మనోహర్‌రెడ్డి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.






