3 August, 2026 | 3:39 AM

కరుణించిన వరుణుడు

03-08-2026 12:46 AM

చెరువులన్నీ జలకళ. రైతు ముఖంలో ఆనందకళ!

పినపాక ఆగస్టు 2, (విజయక్రాంతి): గత కొద్ది రోజులుగా మండల వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వరుణదేవుడు కరుణించాడు. వర్షాభావంతో అల్లాడుతున్న పల్లెలు ఒక్కసారిగా జలకళను సంతరించుకున్నాయి. మండల పరిధిలోని చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండటంతో రైతాంగంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.

భూగర్భ జలాల పెంపుపై చిగురించిన ఆశ

వరుస వర్షాల కారణంగా ఎండిపోయిన వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ వర్షాలతో భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని వ్యవసాయదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, నీరు లేక పనిచేయకుండా పోయిన బోర్లకు కూడా ఈ వర్షాలు జీవం పోస్తాయని, బోర్ల కింద వరి నాట్లు వేసేందుకు ఇబ్బందులు తొలగిపోతాయని రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

జోరుగా ఉప్పొందుకున్న వరి నాట్లు

నీటి కొరత తీరడంతో మండలంలో వరి నాట్ల పండుగ జోరందుకుంది. పొలాల్లో దుక్కులు దున్ని, నారుమళ్లను సిద్ధం చేసి నాట్లు వేసే పనిలో కూలీలు, రైతులు బిజీబిజీగా గడుపుతున్నారు. అనుకూలించిన వాతావరణం, సమృద్ధిగా లభిస్తున్న నీటితో ఈ ఏడాది పండించే వరి పంట మంచి దిగుబడిని ఇస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ట్రాక్టర్ యాజమాన్యంలో ఆనందోత్సవం

పంట పొలాలకు సకాలంలో వర్షపు నీరు అందడం, రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తుండటంతో టాక్టర్ (విత్తనాలు, వ్యవసాయ సేవల) యాజమాన్యం తీవ్ర ఆనందోత్సవం వ్యక్తం చేసింది. పంట సాగు వేగవంతం కావడం వల్ల నాణ్యమైన విత్తనాలు, సరైన యాజమాన్య పద్ధతుల ద్వారా ఈ సారి అధిక దిగుబడులు సాధించవచ్చని పేర్కొంది.

ఫెర్టిలైజర్ షాపుల్లో పెరిగిన గిరాకీ

సాగు పనులు ఒక్కసారిగా వేగం పుంజుకోవడంతో మండల కేంద్రంలోని ఫెర్టిలైజర్ (ఎరువుల) షాపుల్లో గిరాకీ భారీగా పెరిగింది. నాట్లకు కావలసిన విత్తనాలు, డీఏపీ, యూరియా కాంప్లెక్స్ ఎరువుల కొనుగోలు కోసం రైతులు దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు. దీంతో ఎరువుల వ్యాపారుల వ్యాపారం పుంజుకుని, మార్కెట్లో సందడి వాతావరణం నెలకొంది. రైతుల మాట: ‘వర్షాలు లేక బోర్లలో నీళ్లు పడిపోయి చాలా భయపడ్డాం. ఈ భారీ వర్షాలతో చెరువులు నిండి, బోర్లలో కూడా నీటిమట్టం పెరుగుతుంది. ఇప్పుడు నిశ్చింతగా నాట్లు వేసుకుంటున్నాం.‘