21 August, 2026 | 1:19 PM

భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం... మహిళలు ప్రత్యేక పూజలు

21-08-2026 12:14 PM

సౌభాగ్యం, సిరిసంపదలు కలగాలని మహిళల ఆకాంక్ష...

బాన్సువాడ, ఆగస్టు 21 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లాలో శ్రావణ మాసం సందర్భంగా వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.తెల్లవారుజామునే ఇళ్లను శుభ్రం చేసి, పూజా మందిరాలను పూలతో అలంకరించి వరలక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేపట్టారు. కలశ స్థాపన చేసి అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా భావించి పూజలు, నోములు, వ్రత కథను భక్తిశ్రద్ధలతో చదివి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.వరలక్ష్మీ వ్రతం ఆచరించడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు, సౌభాగ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. మహిళలు కొత్త వస్త్రాలు ధరించి, అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి, తోటి ముత్తైదువులకు వాయనం అందజేయడం ఈ వ్రతంలో ప్రత్యేకతగా నిలుస్తుంది. దీంతో గ్రామాలు, పట్టణాల్లోని ఇళ్లన్నీ పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి.