21 August, 2026 | 2:03 PM

గాంధీభవన్‌కు చిన్నన్న.. ఢిల్లీకి మేఘన్న

21-08-2026 12:51 PM

ముదురుతున్న కాంగ్రెస్ పంచాయతీ.. రాజధాని దాటి ఢిల్లీకి 

వనపర్తి,ఆగస్టు 21 (విజయ క్రాంతి): వనపర్తి కాంగ్రెస్‌లో మొదలైన అంతర్గత పంచాయతీ రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. స్థానికంగా మొదలైన విభేదాలు ఇప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు చేరడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎవరి మాట నెగ్గుతుంది..? అధిష్ఠానం ఎవరికి అండగా నిలుస్తుంది..? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇటీవల మంగళవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో(MLA Tudi Megha Reddy) పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌(TPCC President Mahesh Kumar Goud), ఎంపీ మల్లు రవిని వేర్వేరుగా కలిసి తమ అభిప్రాయాలను, వినతులను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో చిన్నారెడ్డికి షోకాజ్‌ నోటీసులు జారీ అయినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరగడం వివాదాన్ని మరింత వేడెక్కించింది.

గాంధీభవన్‌కు చిన్నన్న.. 

ఈ పరిణామాల మధ్య శుక్రవారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిన్నారెడ్డి(Senior Congress leader Chinna Reddy) తన వర్గానికి చెందిన నాయకులతో కలిసి గాంధీభవన్‌ బాట పట్టడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. తన వైపు ఉన్న నాయకుల బలాన్ని చూపిస్తూ అధిష్ఠానానికి తన రాజకీయ ప్రాధాన్యతను చాటే ప్రయత్నమా అన్న చర్చ మొదలైంది.

ఢిల్లీ బాట పట్టిన మేఘన్న ..

మరోవైపు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తన ముఖ్య అనుచరులు, వర్గీయులతో కలిసి ఢిల్లీకి బయలుదేరడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. రాష్ట్ర స్థాయిలో పరిష్కారం దొరకని అంశాన్ని నేరుగా హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లేందుకే ఢిల్లీ పర్యటన అన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

వనపర్తి కాంగ్రెస్‌ చరిత్రలో ఇదే తొలిసారా? 

వనపర్తి కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ దాటి దేశ రాజధాని ఢిల్లీకి చేరడం చర్చనీయాంశంగా మారింది. ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాలు తమ తమ బలాలను ప్రదర్శిస్తూ అటు గాంధీభవన్‌, ఇటు ఢిల్లీ వేదికగా తమ వాదనలను వినిపించేందుకు ప్రయత్నించడం పార్టీ శ్రేణుల్లో ఆసక్తిని పెంచుతోంది.

 సర్దుబాటా..? సమరమా..? 

ఇప్పటి వరకు మాటల యుద్ధంగా సాగిన వనపర్తి కాంగ్రెస్‌ పంచాయతీ ఇప్పుడు అధిష్ఠానం ముందుకు చేరడంతో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. ఇరువర్గాలను సమన్వయం చేసి సర్దుబాటు చేస్తారా..? లేక ఒక వర్గం వైపు అధిష్ఠానం స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందా..? అన్నది ప్రశ్నగా మారింది. చిన్నారెడ్డి–మేఘారెడ్డి మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలకు హైకమాండ్‌ ఎలాంటి ముగింపు పలుకుతుందోనన్న ఆసక్తి వనపర్తి కాంగ్రెస్‌ శ్రేణుల్లో నెలకొంది. చివరకు సర్దుబాటు ఫార్ములా అమలవుతుందా..? లేక వనపర్తి కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు మరింత ముదురుతుందా..? అన్నదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.