21 August, 2026 | 1:20 PM

పాలిటెక్నిక్‌ల విలీనాన్ని విరమించుకోవాలి

21-08-2026 12:18 PM

సిద్దిపేట రూరల్, ఆగస్టు21: పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే జీవో 97ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని బిఆర్ఎస్వి రాష్ట్ర యువ నాయకుడు మొకిల్ల శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. శక్తి శాఖలోని పాలిటెక్నిక్‌ల విలీనం నిర్ణయాన్ని ఉపసంహరించుకుని, సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగించాలని కోరారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్యకు ఏడు దశాబ్దాల ఘన చరిత్ర ఉందని, రాష్ట్రంలోని 59 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో అధిక శాతం నిరుపేద విద్యార్థులు నాణ్యమైన సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. పాలిటెక్నిక్‌లను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం వల్ల పేద విద్యార్థులకు నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. ఏఐసిటిఇ ప్రమాణాలకు అనుగుణంగా ఎస్బిటిఈటి పర్యవేక్షణలో పాలిటెక్నిక్ విద్యను యథావిధిగా కొనసాగించే వరకు బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమంలో పిట్ల రాకేష్, రేణుకుంట వెంకటేష్, దేశపాండే విక్రమ్‌రావు తదితరులు పాల్గొన్నారు.