26 August, 2026 | 12:14 AM

మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి : జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

25-08-2026 09:35 PM

వనమహోత్సవం కార్యక్రమంలో భాగముగా మొక్కలు నాటిన ఎస్పీ 

పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపు 

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ప్రత్యేక వనమహోత్సవ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, భూపాలపల్లి డీఎఫ్‌ఒ కిష్ట గౌడ్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్ పాల్గొని మొక్కలు నాటారు.

రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా 16.03 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9.06 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మొక్కల పెంపకం ద్వారా పచ్చదనం పెరగడంతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్ కుమార్, అడ్మిన్ ఆర్ఐ రత్నం, వెల్ఫేర్ ఆర్ఐ సంతోష్ కుమార్, ఎంటీఒ అర్ఐ పూర్ణచందర్, స్పెషల్ పార్టీ ఆర్ఐ కాశీరాం, అటవీశాఖ అధికారులు, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.