విషజ్వరాలు, వైరల్ ఫీవర్లతో ఆస్పత్రులకు క్యూ
దోమకొండ,(విజయక్రాంతి): వర్షాకాలం నేపథ్యంలో దోమకొండ మండలంలో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయి. విషజ్వరాలు, వైరల్ ఫీవర్లు, డయేరియాతో బాధపడుతున్న ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రిని ఆశ్రయిస్తున్నారు. దోమకొండ ప్రభుత్వ ఆస్పత్రికి రోజుకు సుమారు 400 మంది వరకు అనారోగ్య సమస్యలతో వస్తున్నారని పీడియాట్రిషన్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.కలుషిత నీరు, అపరిశుభ్రమైన ఆహారం వల్ల డయేరియా, వాంతులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. దోమల వృద్ధితో టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాల ప్రమాదం ఉంటుందని తెలిపారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఫిల్టర్ చేసిన శుభ్రమైన నీటిని మాత్రమే తాగాలని, కలుషిత ఆహారానికి దూరంగా ఉండాలని సూచించారు. జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని డాక్టర్ వెంకటేశ్వర్లు కోరారు.






