18 May, 2026 | 1:43 AM

2029లో చట్టసభలకు వడ్డెరలు

18-05-2026 12:50 AM

టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): కూకట్‌పల్లిలో ఆదివారం వడియ రాజుల ఆధ్వర్యంలో నిర్వహించిన సూర్య వంశం వడియరాజు క్షత్రియ ఆత్మీయ సమ్మేళనంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో మల్లన్న మాట్లాడుతూ.. వడ్డెరలు ఏకతాటిపైకి వచ్చి తమ రాజకీయ ఆకాంక్షలను పెంపొందించుకోవాలని, 2029 నాటికి చట్టసభల్లో వడ్డెరలు అడుగుపెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వారు వాస్తవానికి రాజులు (వడియ రాజులు) అని, కానీ కాలక్రమంలో సమాజం వారిని బందిపోటు దొంగలుగా చిత్రీకరించి తీవ్ర అవమానాలకు గురిచేసిందని మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు. మొరాకో దేశంలో మైనింగ్ ద్వారా 3 లక్షల 15 వేల సంవత్సరాల క్రితం నాటి మానవ అవశేషాలను వెలికితీసిన ఘనత ఈ సామాజిక వర్గానిదేనని గుర్తుచేశారు. ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్న సమాజాన్ని దోపిడీదారులుగా ముద్ర వేయడం బాధాకరమని,

వాస్తవానికి మన హక్కులను, సంపదను దోచుకునే వారే అసలైన దొంగలు అని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో సుమారు 60 శాతం సివిల్ మరియు సీసీ వర్క్స్ను వడ్డెర సామాజిక వర్గం కాంట్రాక్టర్లే ఐక్యంగా ఉండి చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. తెలంగాణలో ఆధిపత్య వర్గమైన వెలమల కంటే వడ్డెరల జనాభా నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ చట్టసభల్లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడం శోచనీయం అన్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం మీద వెలమలు కేవలం 5,730 మంది ఉంటే, ఒక్క సిద్దిపేట మండలంలోనే 5,000 మంది వడ్డెరలు ఉన్నారని గణాంకాలు వివరించారు. శేరిలింగంపల్లిలో ఉన్న వడ్డెరలంతా ఏకమైతే, అక్కడి ఎమ్మెల్యే సీటును సునాయాసంగా గెలుచుకోవచ్చని, కాబట్టి వడ్డెరలు కచ్చితంగా రాజకీయాల్లోకి రావాలని కోరారు. 2029లో తెలంగాణలో రాబోయేది బీసీ ప్రభుత్వమేనని, ఆ ప్రభుత్వంలో వడ్డెరలు కూడా భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

మాజీ మావోయిస్ట్, ప్రస్తుత బీసీ ఉద్యమకారుడైన భువనగిరికి చెందిన శంకరన్న భవిష్యత్తులో కచ్చితంగా ఎమ్మెల్యే అవుతారని, ఆయనకు యావత్ బీసీ సమాజం అండగా నిలబడుతుందని ప్రకటించారు. రాజకీయ లక్ష్యాలను చేరుకోవడానికి ముందుగా బలమైన సాంస్కృతిక ఉద్యమం అవసరమని మల్లన్న స్పష్టం చేశారు. దేశ సంపదను, మైనింగ్ రంగాన్ని అంబానీ, అదానీ లాంటి బడా కార్పొరేట్ శక్తులు తమ గుప్పెట్లోకి తీసుకుంటున్నాయని, ఇటు వంటి పరిణామాలను అడ్డుకునేం దుకు బడుగు వర్గాలు ఆలోచించి రాజకీయ అధికారం దిశగా అడుగులు వేయాలని ఈ సంద ర్భంగా తీన్మార్ మల్లన్న సూచించారు.