1 August, 2026 | 2:13 PM

జూలైలో ఇల్లందు ఏరియాలో 1.33 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి

01-08-2026 12:45 PM

ఇల్లెందు, (విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియా జూలై నెల బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను ఏరియా జనరల్ మేనేజర్(Area General Manager) వి. కృష్ణయ్య వెల్లడించారు. శుక్రవారం జీఎం కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జూలై - 2026 నెలకు నిర్దేశించిన 2.13 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 1.33 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి 63 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. ఏరియాలో ఉత్పత్తి చేసిన బొగ్గులో 0.86 లక్షల టన్నులు రోడ్డు మార్గం ద్వారా, 0.94 లక్షల టన్నులు ఆర్‌సీహెచ్‌పీ (RCHP) ద్వారా తరలించి, మొత్తం 1.84 లక్షల టన్నుల బొగ్గును బట్వాడా చేసినట్లు వివరించారు.

అలాగే, 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఇల్లందు ఏరియాకు కేటాయించిన 9.48 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి లక్ష్యానికి గాను ఇప్పటివరకు 6.25 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి 66 శాతం ప్రగతి సాధించినట్లు పేర్కొన్నారు. సురక్షిత వాతావరణంలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనకు కృషి చేసిన సంబంధిత అధికారులు, సూపర్వైజర్లు, యూనియన్ నాయకులు, ఉద్యోగులను ఈ సందర్భంగా జీఎం వి. కృష్ణయ్య ప్రత్యేకంగా అభినందించారు.