పాఠశాల ప్రిన్సిపాల్ రూపా రెడ్డి ఘటనపై ఉట్నూర్ ఏఎస్పీ భరసా
ఉట్నూర్, ఆగస్టు 21 ( విజయక్రాంతి): కొండమల్లేపల్లి నాగార్జున ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ రూపా రెడ్డి మృతి చెందిన ఘటన నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉట్నూర్ ఏఎస్ పి రుత్విక్ సాయితో ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు ఉపాధ్యాయులతో సమావేశమై మాట్లాడారు. ఉపాధ్యాయులు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని, ధైర్యంగా ఉండాలని ఏఎస్పీ సూచించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. మీరు ధైర్యంగా ఉండాలని, పోలీసులు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. మీకు ఏ సమస్య వచ్చినా వెంటనే నా దృష్టికి తీసుకురండి అని ఏఎస్పీ రుత్విక్ సాయి ఉపాధ్యాయులకు భరోసా ఇచ్చారు.
ఈ ఘటన నేపథ్యంలో పాఠశాలల్లో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఉట్నూర్ లోని ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు ఉపాధ్యాయులు ఏఎస్పి, ఐటీడీఏ ఏ పీవో( జనరల్) వసంతరావుకు, ఉట్నూర్ తహసిల్దార్ కోట్నాక్ రఘునాథరావుకు కలిసి ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లకు ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలని ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా తగు చర్యలు తీసుకోవాలని వినతి పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సన్ సైన్ పాఠశాల కరస్పాండెంట్ షేక్ షబ్బీర్, ఎల్ ఎఫ్ ఎస్ పాఠశాల కరస్పాండింగ్ శబస్తీన్ , ఎస్జీవి పాఠశాల కరస్పాండెంట్ నాగన్న, పులాజి బాబా పాఠశాల కరస్పాండెంట్ లక్ష్మీనారాయణ, న్యూ విజన్ పాఠశాల కరస్పాండెంట్ రాయిస్, న్యూ నలంద కళాశాల కరస్పాండెంట్ వసంతరావు జాదవ్, సెంటు పాల్ పాఠశాల కరస్పాండెంట్ వినోద్, గ్రామర్ స్కూల్ పాఠశాల కరస్పాండెంట్ జోమన్, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






