21 August, 2026 | 6:09 PM

మానకొండూర్‌లో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ, కంటి పరీక్షల శిబిరం

21-08-2026 05:03 PM

మానకొండూరు, ఆగస్టు 21 (విజయక్రాంతి): మహిళల్లో క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి, సకాలంలో చికిత్స అందించాలనే ఉద్దేశంతో ఈ నెల 23న (ఆదివారం) మానకొండూర్ మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్‌లో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని నిర్వహించనున్నారని మానకొండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధ్యావ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఈ శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహిస్తారని వివరించారు. శుక్రవారం మండల కేంద్రమైన మానకొండూరులో మర్రి ఓదెలు యాదవ్, రామిడి తిరుపతిరెడ్డి, రేమిడి శ్రీనివాసరెడ్డి, ముద్దసాని శ్రీనివాసరెడ్డి, తాళ్లపల్లి సంపత్ గౌడ్, వరహాలచారి, రేవెల్లి రాజలింగం, తదితరులు, పార్టీ శ్రేణులతో కలిసి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిష్టాత్మకమైన ఎం.ఎన్.జె. క్యాన్సర్ అధ్యయన సంస్థ, హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత నిర్ధారణ పరీక్షల శిబిరం నిర్వహిస్తుండగా, హైదరాబాద్‌కు చెందిన అంకిత్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ యాజమాన్యం శిబిర నిర్వహణకు సహకరిస్తోందని చెప్పారు.

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర పరీక్షలు  నిర్వహించనున్నారని ఈ శిబిరాన్ని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభిస్తారని వివరించారు. మహిళలకు ప్రత్యేకంగా క్యాన్సర్ స్క్రీనింగ్, ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎం.ఎన్.జె. క్యాన్సర్ అధ్యయన సంస్థకు చెందిన వైద్య నిపుణులు ఈ శిబిరంలో పాల్గొని అవసరమైన వైద్య పరీక్షలు,  మహిళల్లో సాధారణంగా కనిపించే క్యాన్సర్లను ముందస్తుగా గుర్తించేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు,  మహిళలకు బ్రెస్ట్(రొమ్ము) క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, సెర్వికల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) పరీక్షలు, ఓరల్ క్యాన్సర్ (నోటి క్యాన్సర్) పరీక్షలు నిర్వహిస్తారని, నియోజకవర్గంలో మండలాల  మహిళలు  ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు.