22 July, 2026 | 11:23 PM

రాహుల్ గాంధీ అక్రమ అరెస్టు అమానుషం

22-07-2026 10:00 PM

 కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన, ధర్నా

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ ఆధ్వర్యంలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును ఖండిస్తూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో శాంతియుత నిరసన కార్యక్రమ నిర్వహించగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఎస్‌ఐఆర్ ఇంచార్జి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, టీపిసీసీ కో ఆర్డినేటర్ సిరాజ్ హుస్సేన్, టీపిసీసీ వరంగల్ పార్లమెంట్ కో ఆర్డినేటర్ నాసర్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, సామాజిక న్యాయాన్ని కాపాడేందుకు నిరంతరం ప్రజల తరుపున పోరాడుతున్న నాయకుడని అన్నారు.

నిరుద్యోగం, రైతుల సమస్యలు, పేదల ఇబ్బందులు, ధరల పెరుగుదల, విద్యార్థుల భవిష్యత్తు వంటి ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే రాజకీయ కక్షసాధింపుతో ఆయనను లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి బెదిరింపులకు భయపడదని, ఒక రాహుల్ గాంధీని అరెస్టు చేస్తే లక్షలాది మంది రాహుల్ గాంధీలు పుట్టుకొస్తారని హెచ్చరించారు.

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్ణాకర్ మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తుందని, రాహుల్ గాంధీపై రాజకీయ కక్షతో జరుగుతున్న చర్యలను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతారని అన్నారు. వెంటనే రాహుల్ గాంధీపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని, రాజకీయ వేధింపులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.