23 July, 2026 | 1:21 AM

కత్తులతో బెదిరించి చోరీ

23-07-2026 12:29 AM
  1.   66 తులాల గోల్డ్, రూ.21 లక్షలు నగదు అపహరణ
  2. కుటుంబంపై దాడి చేసిన అగంతకులు
  3. కరీంనగర్‌లోని భగత్‌నగర్‌లో ఘటన
  4. సంఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా

కరీంనగర్, జూలై22(విజయక్రాంతి): కరీంనగర్‌లోని భగత్‌నగర్‌లో మంగళవారం అర్ధరాత్రి దొంగల బీభత్సం సృష్టించారు. క్రాస్‌రోడ్ సమీపంలో ఒక వృద్ధ దంపతుల ఇంటిలోకి సుమారు ఎనిమిది మంది సాయుధ దొంగలు చొరబడి దాడి చేశారు. అజ్మత్ అలీ ఇంట్లోకి అగంతకులు ప్రవేశించి కుటుంబ సభ్యులను కట్టేసి, తుపాకులు, కత్తులతో బెదిరించి రూ. 21 లక్షల నగదు, 66 తులాల బంగారం, వెండిని దోచుకెళ్లారు.

అజ్మత్ అలీ కుటుంబం భగత్ సింగ్ చౌరస్తాలోని ఓ ఇంట్లో మొదటి అంతస్తులో నివాసం ఉంటోంది. నిద్రపోయే ముందు రోజులాగే కింద ఫ్లోర్‌లో ఉన్న లైట్ బంద్ చేసేందుకు అలీ కిందకు వెళ్తున్న క్రమంలో మధ్యలోనే అతడిని దుండగులు బంధించి ఇంట్లోకి తీసుకొచ్చి తల, ముఖంపై గట్టిగా కొట్టారు. అలాగే యజమాని భార్య, ఇద్దరు కుమార్తెలపై కూడా దాడి చేసి అరిస్తే చంపేస్తామని తుపాకులు, కత్తులతో బెదిరించారు.

బాధితులను కట్టేసి ఇంట్లో ఉన్న 66 తులాల బంగారం, రూ.21లక్షల నగదు, 10 తులాల వెండి ఎత్తుకు వెళ్లారు. ఎవరికీ ఫోన్ చేయకుండా వారి మొబైల్ ఫోన్లను సైతం వెంట తీసుకెళ్లారు.. వెళ్లేముందు వారిని ఒకే గదిలో బంధించి గడియపెట్టి కిందకు దిగారు. కింద పార్కింగ్‌లో ఉన్న రెండు బైక్‌లను చోరి చేసి వాటి మీదే పారిపోయారు. తమ వద్ద ఉన్న డమ్మీ గన్‌ను ఇక్కడే వదిలేసి వెళ్లిపోయారు.

ఈ ఘటనపై పోలీసులు, క్లూస్ టీమ్స్ రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. దొంగలు హిందీ మాట్లాడారని, స్థానిక వ్యక్తుల సమాచారంతోనే ఈ దోపిడీకి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. కాగా, తెలిసిన వ్యక్తులే దోపిడీకి పాల్పడి ఉంటారని అజ్మత్ అలీ ఆరోపిస్తున్నాడు. పెద్ద అల్లుడిపైనే అనుమానం వ్యక్తం చేశాడు. ఇంటికి వచ్చిన ఎనిమిది మంది దుండుగులు ఉత్తరాది హిందీ మాట్లాడారని తెలిపాడు.

తన అల్లుడు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వాడని చెప్పాడు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు సైతం బయటకు వచ్చాయి. పీఎంజే ఘటన మరవక ముందే అదే తరహాలో తుపాకులతో బెదిరించి చోరీకి పాల్పడటం కలకలం రేపుతోంది. కరీంనగర్ సీపీ గౌస్ అలం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేశారు.  బైకుల ఆచూకి కోసం ఆరా తీస్తున్నారు.

సీసీ ఫుటేజీల ఆధారంగా అనుమానితులను వెతుకుతున్న క్రమంలో హుజురాబాద్ సమీపంలోని పెద్ద పాపయ్యపల్లి వద్ద రెండు బైకులను పడేసిన దోపిడీ ముఠా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయినట్టుగా సమాచారం. అయితే దోపిడీకి పాల్పడిన తరువాత ముఠా బృందావన్ ఫంక్షన్ హాల్ మీదుగా పెద్దమ్మగుడి ముందు నుండి సిరిసిల్ల బైపాస్ కు చేరుకుని అక్కడే ఉన్న బంకులో పెట్రోల్ కోసం వెళ్లినట్టుగా గుర్తించారు పోలీసులు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా

కరీంనగర్‌లో అర్ధరాత్రి దొంగల భీభత్సం, దోపిడీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. న్యూఢిల్లీ నుంచి కరీంనగర్ సీపీ గౌస్ ఆలంకు ఫోన్ చేసి  దోపిడీ దొంగలపై ఉక్కుపాదం మోపాలని కోరారు. ఇలాంటివి పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరగా నిందితుల కోసం క్లూస్ టీమ్స్ రంగంలోకి దింపామని సీపీ వివరించారు.