బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్‌గా ఉప్పల శ్రీనివాస్ గుప్త
- శుభాకాంక్షలు తెలిపిన పలువురు
- బ్యాడ్మింటన్ అభివృద్ధికి కృషి చేస్తానన్న ఉప్పల్ శ్రీనివాస్‌గుప్త
నాగోల్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి మరో ముఖ్యమైన అడుగుగా, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్‌గా ఉప్పల శ్రీనివాస్ గుప్త నియమితులయ్యారు. ఈ సందర్భంగా క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు, నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ నియామకంపై ఉప్పల శ్రీనివాస్ గుప్త ఆనందం వ్యక్తంచేస్తూ, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలను అప్పగించిన అసోసియేషన్ ప్రెసిడెంట్, పరిశ్రమ లు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు, ప్రధాన కార్యదర్శి పుల్లెల గోపీచంద్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అసోసియేషన్ సభ్యులందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బ్యాడ్మింటన్ క్రీడ ను మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన యువ క్రీడాకారులను గుర్తించి వారికి సరైన మార్గదర్శకత్వం, సౌకర్యాలు అందించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.
క్రీడా మౌలిక సదుపాయాల పెంపు, శిక్షణా శిబిరాల ఏర్పాటు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తానని పేర్కొన్నారు. ఇకపై తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ, క్రీడా రంగంలో రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచేందుకు తన వంతు కృషి చేస్తానని ఉప్పల శ్రీనివాస్ గుప్త స్పష్టంచేశారు.






