1 July, 2026 | 2:23 AM

ఢిల్లీ దర్బార్‌కు ఆర్‌ఆర్ ట్యాక్స్!

01-07-2026 01:24 AM

తెలంగాణను ఏటీఎంగా మార్చిన కాంగ్రెస్

  1. బడుగు, బలహీనవర్గాలకు అన్యాయం
  2. ఎంఐఎం, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కలిసే ఉన్నాయి 
  3. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ సర్కారే: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నబిన్ 
  4. ఘట్‌కేసర్‌లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

ఘట్‌కేసర్, జూన్ 30 (విజయక్రాంతి): ఢిల్లీ దర్బార్‌కు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు తెలంగాణను ఏటీఎంగా మార్చారని, రాష్ట్రంలో ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఢిల్లీకి పంపుతున్నారని బీజేపీ జాతీయ అధ్య క్షుడు నితిన్ నబిన్ ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, ఎంఐ ఎం, బీఆర్‌ఎస్ కలిసే ఉన్నాయని చెప్పారు.

బీజేపీ కేవలం అధికారమే పరమావధిగా పనిచేసే పార్టీ కాదని, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన నిలిచే ఏకైక నిజమైన ప్రత్యామ్నాయం బీజేపీయేనని అన్నారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి బూత్ స్థాయిలో కమిటీలను బలోపేతం చేయాలని, కొత్త ఓటర్ల నమోదును విస్తృతం చేయాలని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటి కీ తీసుకెళ్లాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు.

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ సర్కిల్ ఎదులాబాద్ డివిజన్ పరిధిలోని అవుషాపూర్‌లో మంగళవారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగిం ది. ఈ సమావేశంలో నితిన్ నబిన్ మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నో వాగ్దానాలు చేసి, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా రాజకీయ ప్రయోజ నాల కోసమే పాకులాడుతోందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే నాయకులు ప్రజల సంక్షేమాన్ని ఎలా కాపాడగలరని ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్ పార్టీ ప్రజాధనాన్ని అంతా ఒకే కుటుంబం కోసం వాడుకుందని విమర్శించారు. ఎన్నికల ముందు 6 గ్యారంటీలు, 66 హామీలు, డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ బాహుబలి రేంజ్ లో బిల్డప్ ఇచ్చిందని కానీ అధికారంలోకి వచ్చాక పరిపాలనలో పూర్తిగా రంగు వెలిసిపోయి బ్లాక్ అండ్ వైట్ గా మారిందన్నారు. హామీల అమలులో ఘోరంగా విఫలమై అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని, కాంగ్రెస్ వైఫల్యాలు, అవినీతి, నయవంచనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.

కాంగ్రెస్ అవినీతి, నేరాల తరహా పాలన సాగిస్తున్నదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్‌ఎస్ కలిసే ఉన్నాయని, బడుగు, బలహీన వర్గాలకు ఇంకా అన్యాయం జరుగుతూనే ఉన్నదని నితిన్ నబీన్ మండిపడ్డారు. బీజేపీ కేవలం అధికారమే పరమావధిగా పనిచేసే పార్టీ కాదని, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన నిలిచే ఏకైక నిజమైన ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఆయన తెలిపారు.

రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి బూత్ స్థాయిలో కమిటీలను బలోపేతం చేయాలని, కొత్త ఓటర్ల నమోదును విస్తృతం చేయాలని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. 

రాష్ట్రంలో అవినీతి, కుటుంబ పాలన: రాంచందర్‌రావు

గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ అవినీతి, కుటుంబ పాలనతో ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేవలం కాంట్రాక్టులు, కమీషన్ల కోసమే పనిచేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ’హైడ్రా’ పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చివేస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతోందన్నారు.

రెక్కల కష్టంతో, బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకుని కట్టుకున్న ఇళ్లను కోల్పోయిన పేదల ఉసురు ప్రభుత్వానికి తగులుతుందన్నారు. సమావేశంలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమార్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, తెలంగాణ ఇన్‌చార్జి అభయ్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

‘స్థానిక’ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

  • రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాజకీయం, వ్యవసాయం, 12 ఏండ్ల మోదీ విజయోత్సవాలపై తీర్మానాలు

మేడ్చల్, జూన్ 30 (విజయక్రాంతి): రాష్ట్రంలో స్థానిక సంస్థలు, నాలుగు కార్పొరేషన్ల ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. మంగళవారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ దిశా నిర్దేశం చేశారు. ప్రధానంగా మున్సిపల్, స్థానిక సంస్థలతో పాటు పార్టీ సంస్థాగతంగా బలోపేతంపై చర్చించి, పలు తీర్మానాలు చేశారు. 12 ఏండ్ల మోదీ విజయోత్సవాల నిర్వహణపై తీర్మానం చేశారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు సొంత ఏటీఎంలా వాడుకున్నదని, అవినీతికి అడ్డగా మార్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులో జరిగిన అవినీతి పక్కనబెట్టి నాణ్యత ప్రమాణాల మీదనే సీబీఐ విచారణ కోరిందని, బీఆర్‌ఎస్ పెద్దలతో కాంగ్రెస్ నాయకులు లోపా యికారి ఒప్పందానికి ఇదే నిదర్శనమని పేర్కొంటూ తీర్మానం చేశారు. దీనిపై బీజే పీ నేతలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 500 రూపాయలు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి న తర్వాత ఈ హామీని నీరుగార్చిందని, ఏడు రకాల కే భువనస్పరిమితం చేసి రైతులను మోసం చేసిన తీరుపై చర్చించాలని తీర్మానించారు. ఫీజు రియింబర్స్‌మెంట్ విషయంపైనా ప్రజల్లోకి తీసుకెళ్లాలని తర్మానించారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలోనూ అవకతవకలు జరిగాయన్న విషయంపై, మూసి లూటీ, హైడ్రా అరాచకంపై చర్చించాలన్నారు.