1 July, 2026 | 3:00 AM

వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం

01-07-2026 02:02 AM

స్వానిధి మహోత్సవ్‌లో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్

హనుమకొండ టౌన్, జూన్ 30 (విజయ క్రాంతి): వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబన, జీవనోపాధి భద్రత, సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని హనుమకొండ జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్ అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో నిర్వ హించిన స్వానిధి మహోత్సవ్ 2026 కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్నీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వీధి వ్యాపారుల ఆర్థిక ప్రగతి, స్వ యం ఉపాధి బలోపేతం, కుటుంబాల జీ వన ప్రమాణాల మెరుగుదలే స్వానిధి మహోత్సవ్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలను ప్రతి అర్హులైన వీధి వ్యాపారి సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించాలని సూచించారు. స్వానిధి మహోత్సవ్లో భాగంగా వీధి వ్యాపారులు, వారి కుటుంబ సభ్యులకు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు ఆయా పథకాల ప్రయోజనాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.

డిజిటల్ చెల్లింపులను విస్తృతంగా వినియోగిస్తూ ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకోవాలని పిలుపునిచ్చారు.ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 48 వేల మంది స్ట్రీట్ వెండర్లు నమోదయ్యారని, కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి ఎప్పటికప్పుడు నమోదు అవకాశం కల్పిస్తూ, జాబితాను నిరంతరం నవీకరించాలని అధికారులకు సూచించారు.

చిరు వ్యాపారల వరంగల్ జిల్లా అధ్యక్షుడు గజ్జల లింగమూర్తి మాట్లాడుతూ సీజన్ బట్టి కాకుండా కాలంతో సంబంధం లేకుండా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, వ్యాపారాన్ని కొనసాగించే చిరు వ్యాపారులకు మాత్రమే ఐడి కార్డులు ఇచ్చి రుణాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ రాజేశ్వర్, ఉప కమిషనర్ సమ్మయ్య, ఎల్ డిఎం మహేందర్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి నవీన్ కుమార్, డి ఎం సి రజిత రాణి, టి ఎం సి వెంకట్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.