ఆగని ఇసుక అక్రమ రవాణా?
యథేచ్ఛగా ఇసుక తరలింపు.. పట్టించుకుని అధికారులు..
ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటికి స్థానికులు వినతి..?
చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చిన మంత్రి
కూసుమంచి, ఫిబ్రవరి 27(విజయక్రాంతి): అధికారుల నిర్లక్ష్యమో..? పోలీసుల వైఫల్యమో..? మైనింగ్ అధికారుల పనితీరు లోపమో..? ఏమో కానీ.. కూసుమంచి మండలంలోని పాలేరు ఏటిలో ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు..ఆరు కాయలుగా వర్థిల్లుతోంది.. ప్రభుత్వ పథకాలకు వినియోగించాల్సిన ఇసుక ను కొందరు వ్యాపారులు అడ్డగోలుగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ రవాణా చేస్తున్నారు.
ఇండస్ట్రీయల్ కు, ఇతర బిల్డర్లకు ఇసుకను తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే కడుపేదలు, మధ్యతరగతి ప్రజలకు అధిక ధరలకు విక్రయాలు చేస్తున్నారు. అంతే కాకుండా ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక దొరికే పరిస్థితి కనిపించడం లేదు.. దీంతో ప్రజలు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇన్ టైమ్ లో ఇసుక అందక ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయలేకపోతున్నారు.
ఫిర్యాదులు వస్తున్న పట్టించుకుని అధికారులు
పాలేరు ఏటి నుంచి భారీగా ఇసుక అక్రమంగా తరలివెళ్తుందని సమీప గ్రామాలకు చెందిన పలువురు రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబంధిత రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులకు అనేక మార్లు ఫిర్యాదు చేశారు. గత రెండు పది రోజుల నుంచి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు.
అయినప్పటికి ఆయా శాఖల అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదనీపిస్తోంది.. పోలీసులకు సమాచారం అందిస్తే రెవెన్యూ వాళ్లకు చెప్పాలని, రెవెన్యూ వాళ్లకు ఫిర్యాదు చేస్తే పోలీసులకు చెప్పాలని, వాళ్లకి పోను చేస్తే మైనింగ్ అధికారులకు చెప్పాలని ఫిర్యాదు దారులకు చుక్కలు చూపించే పరిస్థితి వచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
భవిష్యత్‌లో ఇసుక దొరుకుతుందా..?
ఏప్రిల్ నెలలో రెండవ దఫా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అలాగే ఎండాకాలం కావడంతో అన్ని గ్రామాలకు సీసీ రోడ్లు, నూతన భవనాలు మంజూరు అయ్యే అవకాశం ఉంది. రెసెడిన్సియల్ స్కూల్, కళాశాల, 100 పడకల ఆసుపత్రి ఇలాంటి ప్రభుత్వ పథకాలు ఇప్పటికే మంజూరైయ్యి ఉన్నాయి. ఇప్పుడే పాలేరు ఏటి నుంచి వరదలా ఇసుకను అక్రమంగా తరలిస్తే, భవిష్యత్ లో ప్రభుత్వ పథకాలకు ఇసుక దొరికే పరిస్థితి ఉంటుందా..? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఇసుక అక్రమాలను అడ్డుకోవాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.
మంత్రికి ఫిర్యాదు చేసిన నాయకులు
కూసుమంచి మండలంలోని పాలేరు వేటి నుంచి కొందరు వ్యాపారులు ఇష్టానుసారంగా ఎలాంటి అనుమతులు లేకుండా భారీగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని, అట్టి ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని మండలంలోని పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానికులు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతి చేసినట్లు తెలుస్తోంది..
పాలేరు ఏటి సమీపంలోని జక్కేపల్లి, చనుపల్లి, రాజుపేట తదితర గ్రామాలకు చెందిన కొందరు రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గత రెండు రోజులుగా పోన్ ద్వారా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సమస్యను వివరించినట్లు ప్రచారం జరుగుతోంది..గత నాలుగు రోజుల క్రితం ఖమ్మం వచ్చిన మంత్రికి జక్కేపల్లి వాసులు కలిసి ఇసుక అక్రమ రవాణా సమస్యను వివరించినట్లు తెలుస్తోంది. దీంతో స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తక్షణమే చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చినట్లు తెలుస్తోంది. మరీ ఇప్పటికైనా ఇసుక అక్రమ రవాణాకు అధికారులు అడ్డుకట్టవేస్తారో..? లేదో..? వేచి చూడాల్సిందే..?




