గోలిలింగలో ఉపాధి హామీ పనులపై ఎంపీడీవో విస్తృత తనిఖీ
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని గోలిలింగాల గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్) కింద జరుగుతున్న పనులను ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ సమగ్రంగా తనిఖీ చేశారు. గ్రామంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ, క్షేత్రస్థాయిలో అమలు పరిస్థితులపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కూలీల హాజరు పట్టికను పరిశీలించిన ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ హాజరు శాతం ఆశించిన స్థాయిలో ఉండాలని సూచించారు.
పని చేసే ప్రతి కూలీ హాజరు నమోదు సక్రమంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని,ఎటువంటి లోపాలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టాలని ఫీల్డ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.ప్రస్తుతం గ్రామంలో 141 మంది కూలీలు పనుల్లో పాల్గొంటున్నట్లు అధికారులు వెల్లడించారు.పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.ప్రతి పని కొలతల ప్రకారం,నిబంధనలకు అనుగుణంగా నిర్వహించబడాలని స్పష్టం చేశారు.
అలాగే పనుల వేగం పెంచడంతో పాటు,నాణ్యతలో రాజీ పడకూడదని హెచ్చరించారు.పథకం లక్ష్యం గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించడమే కాకుండా,గ్రామాభివృద్ధిని సాధించడమని ఆయన అన్నారు.ఈ దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుర్రకాయల రోజా బాబు, కార్యదర్శి సంతోష్ కుమార్,ఫీల్డ్ అసిస్టెంట్ లింగ గౌడ్ ఇతర సిబ్బంది,కూలీలు పాల్గొన్నారు.






