11-02-2026 12:59:17 AM
ఢాకా, ఫిబ్రవరి 10: బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అందరికీ సమాన హక్కులు అని ప్రకటిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం హిందువులే లక్ష్యంగా దాడులు, హత్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు హిందువులను బంగ్లాదేశ్‌లో దారుణంగా హతమార్చారు. ఈ నెల 12న బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో... అక్కడ మరో హిందువును హత్య చేశారు.
మైమెన్ సింగ్ జిల్లా లో ఈ దారుణం చోటుచేసుకుంది. సుషేన్ చంద్ర సర్కార్ (62) అనే వ్యాపారిని ఆయన దుకాణంలోనే హత్య చేశారు. హతుడు త్రిషల్ సబ్ జిల్లాలోని బోగర్ బజార్‌లో బియ్యం వ్యాపారం చేస్తున్నారు. ఈయన ఇదే ప్రాంతంలోని సౌత్ కాండ గ్రామంలో నివసిస్తున్నారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ హత్య జరిగిందని పోలీసులు తెలిపారు.
దుండగులు కత్తులతో ఆయనపై దాడి చేశారని... ఆ సమయంలో సుషేన్ తన దుకాణంలోనే ఉన్నాడని వెల్లడించారు. హత్య చేసిన తర్వాత నిందితులు షట్టర్ దించి, మృతదేహాన్ని అక్కడే వదిలి వెళ్లిపోయారని తెలి పారు. నిందితుల కోసం గాలిస్తున్నామని , కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.