27 August, 2026 | 5:24 PM

చెట్లే ఆత్మీయ నేస్తాలు..

27-08-2026 10:57 AM

చెట్లకు రాఖీలు కట్టిన ‘ప్రకృతి మిత్ర’లు 

మంచిర్యాలలో ‘వృక్ష రక్షబంధన్’ వైవిధ్య కార్యక్రమం

మంచిర్యాలటౌన్,(విజయక్రాంతి): రాఖీ పౌర్ణమి(Raksha Bandhan 2026) పురస్కరించుకొని ‘ప్రకృతిమిత్ర’ తెలంగాణ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా(Mancherial District) కేంద్రంలోని జన్మభూమి నగర్ లో గల రాముని చెరువు కట్టపై ‘వృక్ష రక్షబంధన్’(Vriksha Raksha Bandhan) పేరిట వైవిధ్యభరితమైన కార్యక్రమాన్ని ఆ సంస్థ  రాష్ట్ర వ్యవస్థాపకులు, తెలంగాణ ప్రభుత్వ ‘వాల్టా’ పర్యావరణ చట్టం సెనేట్ సభ్యులు గుండేటి యోగేశ్వర్ ప్రకృతి మిత్రుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సహజమైన పదార్థాలతో చేసిన రాఖీలు కట్టుకొని వివిధ ప్రకృతిమిత్ర పదార్థాలతో (అట్ట, కాగితం, ధాన్యం గింజలు ,ఆకులు, పూల రెక్కలు, డ్రై ఫ్రూట్స్ వ్యర్థాలు, దూదితో) చేసిన ఆకర్షణీయమైన పెద్ద సైజు రాఖీలను తయారు చేసి చెట్లకు కట్టి ‘మనిషికి చెట్టు రక్ష.. చెట్టుకు మనిషి రక్ష’ అంటూ ఆలింగనం చేసుకున్నారు.

అనంతరం చెట్ల చుట్టూ మానవహారం గా ఏర్పడి చెట్లే ప్రగతికి మెట్లు.., చెట్లను నరికితే ఇక్కట్లు.., వేయకు చెట్టుకు వేటు.., చేయకు భూమాతకు చేటు.., వనాలు ప్రకృతి ఇచ్చిన వరాలు.., కాపాడుతాయి అవి మనల్ని తరతరాలు.., చెట్టును ఆత్మీయ నేస్తాలుగా చేరదీయాలని, అమ్మ నాన్నలుగా పూజించాలని నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యవస్థాపకులు గుండేటి యోగేశ్వర్ తో పాటు ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి రత్నాకర్ రావు, రెవెన్యూ అధికారి గడియారం శ్రీహరి, రాచకొండ చందన, రాధేశ్యాం, మంచిర్యాల ప్రకృతి మిత్రులు ప్రభాకర్, శరత్ చంద్ర, రాజశేఖర్, మధు, శ్యామ్, సునీత, లాస్య, వాకర్స్ మిత్రులు తదితరులు పాల్గొన్నారు.