27 August, 2026 | 10:10 PM

అనుమతుల్లేకుండా 8, 9వ తరగతుల నిర్వహణపై శ్రీచైతన్యలో తనిఖీలు

27-08-2026 05:23 PM

అనుమతులు లేవంటూ విద్యాశాఖ అధికారులు ఫ్లెక్సీ ఏర్పాటు

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో అనుమతులు లేకుండా 8, 9వ తరగతులను నిర్వహిస్తున్నారన్న ఫిర్యాదుపై బాన్సువాడ పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలలో విద్యాశాఖ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఏఐపీఎస్‌యూ చేసిన ఫిర్యాదు మేరకు మండల విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది పాఠశాలకు వెళ్లి తరగతుల నిర్వహణ, అనుమతులకు సంబంధించిన వివరాలను పరిశీలించారు.

సంబంధిత విద్యాశాఖ నుంచి 8, 9వ తరగతుల నిర్వహణకు అనుమతులు లేవని అధికారులు గుర్తించినట్లు తెలిపారు. అనుమతులు లేకుండా తరగతులు నిర్వహించడం, విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ సందర్భంగా ఏఐపీఎస్‌యూ రాష్ట్ర కమిటీ సభ్యుడు గోపాల్‌సింగ్‌ ఠాకూర్ మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.

పాఠశాల యాజమాన్యంపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులు అనుమతులు ఉన్న పాఠశాలల్లో విద్యాభ్యాసం కొనసాగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.అనుమతులు లేకుండా తరగతులు నిర్వహించే విద్యాసంస్థలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్‌వైఎఫ్‌ ఉమ్మడి జిల్లా కార్యదర్శి పిట్ల నరేష్, ఏఐపీఎస్‌యూ నాయకులు సూర్యపాల్,శివాజీ తదితరులు పాల్గొన్నారు.