కుల గణన శాస్త్రీయంగా జరగాలి
మహబూబాబాద్ (విజయక్రాంతి): జన గణనలో కుల గణన కోసం ప్రత్యేకంగా ప్రతి కులానికి ఒక యూనిక్ కోడ్ పెట్టి ఓ బీసీ కాలంలో చేర్చాలని ప్రధానమంత్రికి దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని చేపట్టినట్లు బీసీ సంఘం నేత డాక్టర్ పరికిపండ్ల అశోక్ తెలిపారు. శనివారం కేసముద్రం మండల కేంద్రంలో బీసీ సంఘం నాయకుడు సామల నరసయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ పరికిపండ్ల అశోక్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. ఈనెల 14న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ లో జనగణన షెడ్యూల్లోని పదవ అంశంలో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ఇతర కులం అని మాత్రమే పేర్కొన్నారని, ఓబీసీ, ఎస్ ఈ బీ సీ వర్గాలను విడిగా ప్రస్తావించకపోవడంతో బీసీలలోఆందోళన నెలకొందన్నారు.
బీసీలకు ముంచుకొస్తున్న ప్రమాదాన్ని తక్షణమే ఎదుర్కోవాలని, దశాబ్దాల పోరాటంతో సాధించిన కుల గణన కార్యక్రమాన్ని బర్బాదు చేయాలని చూస్తున్న ఆదిపత్య వర్గాల కుట్రలను అందరం కలిసి ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ మేధావుల ఫోరం రాష్ట్ర నాయకులు డాక్టర్ కూరపాటి రమేష్, ధర్మ టీచర్స్ యూనిటీ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామెర ఉపేందర్ మహారాజు, బీసీ ఎస్సీ ఎస్టీ ఉమ్మడి వరంగల్ నాయకులు డాక్టర్ చందా మల్లయ్య, వివిధ కుల సంఘాల నాయకులు శీలం సత్యనారాయణ, కొలిపాక వెంకన్న, పోకల శ్రీనివాస్, చాగంటి కిషన్, మోడెమ్ వెంకటేశ్వర్లు, కూన భద్రాద్రి, మామిడాల శ్రీనివాస్, బత్తుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.






